అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hormuz Indian Ships | భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. హర్ముజ్ జల సంధి నుంచి భారత నౌకలను అనుమతిస్తామని ప్రకటించింది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన 20 నౌకలు త్వరలో భారత్‌కు రానున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ రవాణా నిలిచిపోయింది. ఫలితంగా పలు దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. మరోవైపు ముడి చమురు ధరలు సైతం భారీగా పెరిగాయి. ఈ క్రమంలో భారత్ ఇరాన్‌తో చర్చించడంతో కొన్ని నౌకలను అనుమతించింది. తాజాగా తమ మిత్ర దేశాల నౌకలను హర్ముజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించింది.
Hormuz Indian Ships | ఐదు దేశాల నౌకలకు..
భారత్ సహా చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ నౌకలను హర్ముజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి గురువారం తెలిపారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ సైతం ఈ మేరకు ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిని తెరవాలని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ తాజా ప్రకటన చేసింది. యుద్ధాన్ని ముగించాలని అమెరికా, ఇజ్రాయెల్‌లను కోరారు.
Hormuz Indian Ships | శత్రుత్వం లేని నౌకలు
న్యూయార్క్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Embassy) శత్రుత్వం లేని నౌకలను హర్ముజ్ నుంచి అనుమతిస్తామని బుధవారం ప్రకటించింది. ఇరాన్‌పై దురాక్రమణ చర్యలలో పాల్గొనకుండా, మద్దతు ఇవ్వకుండా ఉన్న దేశాల నౌకలకు పంపిస్తామని తెలిపింది. భద్రతా నిబంధనలను పూర్తిగా పాటిస్తే ఇరాన్ అధికారుల సమన్వయంతో ఆ దేశాల నౌకలు జలసంధి నుంచి సురక్షితంగా వెళ్లొచ్చని పేర్కొంది.
Hormuz Indian Ships | తప్పనున్న గ్యాస్ తిప్పలు
భారత్‌లో ప్రస్తుతం గ్యాస్ కొరత నెలకొంది. గృహావసరాల సిలిండర్ల కొరత లేకున్నా.. వాణిజ్య సిలిండర్ల విషయంలో కొరత ఉంది. దీంతో కేంద్రం గ్యాస్‌పై పలు ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల రెండు నౌకలు హార్ముజ్‌ను దాటి వచ్చాయి. అయితే అక్కడ మరో 20 వరకు భారత నౌకలు ఉన్నాయి. అందులో ఎల్పీజీ, చమురు ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని ఇరాన్ అనుమతిస్తే.. త్వరలో భారత్ చేరుకునే అవకాశం ఉంది. నౌకలు వస్తే.. దేశంలో గ్యాస్ కొరత తీరనుంది.
ఇది కూడా చదవండి..: Padma River Bus Accident | ఘోర విషాదం.. పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు 23 మంది దుర్మరణం!

