అక్షరటుడే, వెబ్డెస్క్: Hormuz LPG tanker | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం మొదలై ఆరు వారాలవుతోంది. ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ సరుకు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ మూసి వేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముడి చమురు, ఎల్‌పీజీ (LPG)తోపాటు సరుకు రవాణాలోనూ జాప్యం జరుగుతోంది. దీంతో చాలా దేశాలు చమురు, గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి.
Hormuz LPG tanker | ఉద్రిక్తతలు ఉన్నా..
హోర్ముజ్ జలసంధి భారతదేశ ఇంధన సరఫరాకు కీలకమైన మార్గం. భారతదేశ ఎల్‌పీజీ (India’s LPG) దిగుమతులలో సుమారు 90 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. అలాగే ముడి చమురులో అధిక భాగం కూడా ఇక్కడి నుంచే వస్తుంది. కాగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశానికి ఎల్‌పీజీ సరఫరా మాత్రం కొనసాగుతోంది. శత్రుత్వ కార్యకలాపాలలో పాల్గొనని నౌకలకు తమ జలాలు తెరిచే ఉంటాయని ఇరాన్ (Iran) స్పష్టం చేసింది. భద్రతా నియమాలను పాటిస్తూ, ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకున్నంత కాలం భారతీయ నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతి ఉంది.
Hormuz LPG tanker | ఏప్రిల్ 6వ తేదీ నాటికి
దీంతో ఇప్పటికే ఆరు నౌకలు భారత్‌కు చేరుకున్నాయి. తాజాగా 46 వేల మెట్రిక్ టన్నులకుపైగా ఇంధనాన్ని తీసుకువస్తున్న ‘గ్రీన్ సాన్వి’ (‘Green Sanvi’) అనే భారీ ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్ హోర్ముజ్ జలసంధిని దాటింది. ఇది ఏప్రిల్ 6వ తేదీ నాటికి ముంబయికి చేరుకుంటుందని అంచనా. ఈ ట్యాంకర్ సురక్షితంగా ప్రయాణిస్తోందని, షెడ్యూల్ ప్రకారం తన ప్రయాణాన్ని పూర్తి చేసే మార్గంలో ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ తెలిపింది. కాగా మరో రెండు ఎల్‌పీజీ క్యారియర్లు, ‘గ్రీన్ ఆశ’, ‘జగ్ విక్రమ’ ప్రస్తుతం జలసంధి గుండా రావడానికి భారత నౌకాదళం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ ప్రాంతంలో చిక్కుకున్న అన్ని భారతీయ నౌకలు (Indian Ships) సురక్షితంగా ప్రయాణించేలా అధికారులు కృషి చేస్తున్నారు.
Hormuz LPG tanker | సుమారు 20 వేల మంది..
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో భారతదేశానికి చెందిన అనేక నౌకలు ఉన్నాయి. సుమారు 20,500 మంది భారతీయ నావికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 500 మందికిపైగా భారత జెండా ఉన్న నౌకలలో ఉండగా.. 1,100 మందికి పైగా సిబ్బందిని ఇప్పటికే సురక్షితంగా తరలించారు.
ఇది కూడా చదవండి..: Iran Downs US Jets | అమెరికా యుద్ధ విమానాలు కూల్చి వేసిన ఇరాన్
