అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫలక్‌నుమా ప్యాలెస్ (Falaknuma Palace) సమీపంలోని ఫర్నిచర్‌షాప్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది.
ఫలక్‌నుమా ఫ్యాలెస్ సమీపంలోని ఒక ఫర్నీచర్ దుకాణంలో సోమవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుకాణంలో కలప, కుషన్లు, ఫర్నీచర్ ఉండటంతో క్షణాల్లో వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Hyderabad Fire Accident | 5 ఫైరింజన్లతో..
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా ఫర్నిచర్ దుకాణం వెనుకాల ఇండేన్ గ్యాస్ (Indane Gas) గోదాం ఉంది. దీంతో మంటలు అక్కడకు వరకు వ్యాపిస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడ్డారు. అయితే ఫైర్ సిబ్బంది 5 ఫైరింజన్లో మంటలను ఆర్పివేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Fire Accident | వరుస ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో ఇటీవల అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా ఫర్నిచర్ దుకాణాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మూడు రోజుల క్రితం చందానగర్‌లోని ‘ట్విన్ టవర్స్’ ఫర్నిచర్ మాల్ (Twin Towers Furniture Mall)లో ఉన్న ఐదు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలోని ఒక టవర్ పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తుంది.
Hyderabad Fire Accident | బాచుపల్లిలో..
బాచుపల్లిలో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాలు ఇటీవల అగ్నికి ఆహుతి అయ్యాయి. దాదాపు 50 దుకాణాలు కాలిపోవడంతో రూ.5 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది. గతంలో నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. నగరంలో వరుస ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం

