అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Furniture Mall Fire | హైదరాబాద్ (Hyderabad)లో గత రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చందానగర్‌లోని ‘ట్విన్ టవర్స్’ ఫర్నిచర్ మాల్ (Twin Towers Furniture Mall)లో ఉన్న ఐదు అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలోని ఒక టవర్ పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తుంది.
భవనంలో ఉన్న భారీ ఫర్నిచర్ స్టాక్ అంతా అగ్నికి ఆహుతైంది. ఫర్నిచర్ షోరూమ్‌లో పెద్ద ఎత్తున సోఫాలు, బెడ్‌లు, టేబుల్స్, అల్మారాలు వంటి వస్తువులు నిల్వ ఉండటంతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. దీంతో భవనం లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం దగ్ధమైపోయింది. ఈ ఘటనలో కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Hyderabad Furniture Mall Fire | భారీ అగ్ని ప్రమాదం..
అయితే అగ్ని తీవ్రత కారణంగా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనాలకు కూడా మంటలు వేగంగా వ్యాపించాయి. వెనుక వైపు ఉన్న ఐదు అంతస్థుల రాజు హాస్పిటల్ భవనానికి కూడా మంటలు వ్యాపించినట్లు సమాచారం. దీంతో చందానగర్ (Chandanagar) పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కప్పుకుపోయాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Hyderabad Furniture Mall Fire | జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ఈ అగ్నిప్రమాదం (Fire Accident) కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తూ పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) వల్లే ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలున్నాయా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. ఆస్తి నష్టం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ

