అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Gosala Project | రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ శివారులో ఆధునిక వసతులతో ప్రపంచ స్థాయి గోశాల నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) మండలం యెంకపల్లిలో రూ.157 కోట్లతో దీనిని నిర్మించనున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల మంచిరేవుల గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఓంకారేశ్వర ఆలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. అదే రోజు గోశాల నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దీనిని నిర్మిస్తామని ప్రభుత్వం తెలిపింది. పశువుల ఆరోగ్యం, పర్యావరణ స్థిరత్వం, ప్రజల్లో గోసేవపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Hyderabad Gosala Project | హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో..
గోశాల నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం హెచ్ఎండీఏ (HMDA)కు అప్పగించింది. యెంకపల్లిలోని సర్వే నంబర్ 180లో ఉన్న సుమారు 99 ఎకరాల 14 గుంటల భూమిని దీని కోసం కేటాయించింది. దీనిలో సుమారు వెయ్యి ఆవులను సంరక్షించేలా ఆధునిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. గోశాలలో షెడ్లు, క్వారంటైన్ సౌకర్యాలు, మిల్కింగ్ పార్లర్, అత్యవసర చికిత్స విభాగం, పాల ప్రాసెసింగ్ యూనిట్ వంటి వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందులో అవుట్ పేషెంట్ విభాగం, శస్త్రచికిత్స గది, ఐసోలేషన్ వార్డులు, ఫార్మసీ, ఎక్స్-రే గది, పాథాలజీ ల్యాబ్‌లతో కూడిన పశువైద్య ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు.
Hyderabad Gosala Project | 54 ఎకరాల్లో మేత..
గోశాలలోని పశువుల ఎరువుతో బయోగ్యాస్, సీఎన్‌జీ ఉత్పత్తి చేసే ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సౌర విద్యుత్ ప్లాంట్ సైతం నెలకొల్పుతారు. పశువుల మేత కోసం 54 ఎకరాల్లో గడ్డి సాగు చేయనున్నారు.
దీనిని కూడా చదవండి : Hate Speech Bill | సోషల్ మీడియాలో వేధింపులపై చర్యలు.. కీలక బిల్లు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
