అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Love Fraud | హైదరాబాద్‌లో (Hyderabad) వెలుగులోకి వచ్చిన ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి, వివాహం తర్వాత శారీరక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఓ యువతి ఆరోపించింది.
బాధితురాలు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అనుభవాలను వెల్లడించింది. బాధితురాలి వివరాల ప్రకారం, అద్దె ఇంటి కోసం వచ్చిన నవాజ్ అనే వ్యక్తి పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో తనను నమ్మించాడని తెలిపింది. తాను మతం మార్చుకున్నానని చెప్పి తనను విశ్వసింపజేశాడని, ఆ తర్వాత ఇద్దరూ గత ఏడాది జూలై 28న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు వెల్లడించింది.
Hyderabad Love Fraud | వేధింపులు
పెళ్లికి ముందే తన నుంచి సుమారు రూ.16.5 లక్షలు తీసుకున్నాడని, వివాహం తర్వాత అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆరోపించింది. పెళ్లి జరిగిన రోజు నుంచే భర్త కుటుంబ సభ్యులు తనను వేధించడం ప్రారంభించారని బాధితురాలు తెలిపింది. శారీరకంగా దాడులు చేయడం, బెదిరింపులకు గురి చేయడం, తనపై బలవంతాలు చేయడం వంటి ఘటనలు ఎదుర్కొన్నానని ఆమె ఆరోపించింది. తాను ఎదిరించకుండా ఉండేందుకు మత్తు మందులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అలాగే తనకు చెందిన సుమారు 12 తులాల బంగారం, స్థలాన్ని కూడా తీసుకుని విక్రయించారని ఆరోపించింది. ఫోన్, ఇతర వ్యక్తిగత వస్తువులను కూడా వాడుకున్నారని తెలిపింది.
Hyderabad Love Fraud | కనిపించకపోవడంతో..
ఈ ఏడాది జనవరి 16 నుంచి నవాజ్ (Nawaz) కనిపించడం లేదని, దాంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపింది. అయితే కేసును కేవలం మిస్సింగ్‌గా మాత్రమే నమోదు చేశారని, కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మార్చిలో అతడు కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి తనను బెదిరించాడని కూడా ఆరోపించింది. గత రెండు నెలలుగా సరైన చర్యలు తీసుకోలేదని పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తనలాంటి పరిస్థితి మరే యువతికి రాకూడదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజానిజాలు బయటపెట్టాలని కోరింది. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
దీనిని కూడా చదవండి : Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్ బుకింగ్
