అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Luxury Housing | భారత్‌లో విలాసవంతమైన, ఖరీదైన ఇళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఏటా లగ్జరీ హౌసింగ్ మార్కెట్ (Luxury Housing Market) గణనీయంగా పెరుగుతూనే వస్తోంది. సంప్రదాయ మెట్రో కేంద్రాల నుంచి కొత్త భౌగోళిక ప్రాంతాలు, శివార్లకు లగ్జరీ గృహ మార్కెట్ విస్తరిస్తోంది. డెవలపర్లు పెద్ద లేఅవుట్లలో ప్రీమియం వసతులు, ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టైల్ (Integrated Lifestyle) సౌకర్యాలతో ఇళ్లను నిర్మిస్తున్నారు.
అద్భుతమైన డిజైన్, మెరుగైన జీవనశైలి కోరుకునే కస్టమర్లను ఇవి ఆకర్షిస్తున్నాయి. డబ్బులకు కొదవలేనివారు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది త్రీ బీహెచ్కే.. ఫోర్ బీహెచ్కే ఇళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత లగ్జరీ హౌసింగ్ మార్కెట్ గతేడాది 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. వచ్చే సంవత్సరంలో ఇది గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Hyderabad Luxury Housing | టౌన్ షిప్ ల అభివృద్ధితో..
ప్రధాన నగరాల్లో లగ్జరీ ప్రైజ్ ఇండెక్స్ (ఎల్‌పీఐ) 2021లో 2.32గా ఉండగా.. 2025 నాటికి 2.27కి తగ్గింది. ఇదే సమయంలో కొత్త ప్రాంతాలు, శివార్లలో ఎల్‌పీఐ 1 నుంచి 1.44కి పెరిగింది. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ, పెద్ద ఎత్తున టౌన్ షిప్‌ల అభివృద్ధితో శివార్లలో లగ్జరీ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. మధ్యస్థ లగ్జరీ గృహాల ధరలు ముంబయిలో అత్యధికంగా రూ. 9.66 కోట్లుగా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2.20 కోట్లు, చెన్నైలో రూ. 2 కోట్లుగా ఉన్నాయి.
Hyderabad Luxury Housing | టాప్ -3లో హైదరాబాద్..
అత్యంత విలాసవంతమైన, ఖరీదైన ఇళ్లకు సంబంధించిన అమ్మకాలు హైదరాబాద్ (Hyderabad) లో జోరుగా సాగుతున్నాయి. దీంతో దేశంలోని టాప్ -3లో నగరాల్లో హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. కొన్ని నివేదికల ప్రకారం లగ్జరీ ఇళ్ల అమ్మకాలలో భాగ్యనగరం మూడో స్థానంలో ఉండగా.. మరికొన్ని నివేదికల ప్రకారం రెండో స్థానంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం 2025లో రూ. లక్ష కోట్ల విలువైన విక్రయాలతో లగ్జరీ ఇళ్ల అమ్మకాలలో హైదరాబాద్ దేశంలోనే ద్వితీయ స్థానంలో ఉండడం గమనార్హం. రూ. 1.83 లక్షల కోట్ల విలువైన లగ్జరీ ఇళ్ల అమ్మకాలతో దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ఇందులో ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ మూడో స్థానంలో నిలిచింది. లగ్జరీ సెగ్మెంట్‌లో ధరలు 12 నుంచి 13 శాతం వరకు పెరిగినా అమ్మకాల్లో కూడా బలమైన వృద్ధి కనిపించడం గమనార్హం.
Hyderabad Luxury Housing | ఎందుకు డిమాండ్ అంటే..
హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల మార్కెట్ పెరగడానికి పలు కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఐటీ, ఫార్మా సెక్టార్‌ల వల్ల ఉన్నత ఆదాయం ఉన్నవారి సంఖ్య పెరగడంతో కొనుగోలు శక్తి పెరిగి విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో కోకాపేట్, నార్సింగి, కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Financial District) వంటి ప్రాంతాల్లో ప్రీమియం ప్రాజెక్టులు ఎక్కువ నిర్మిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Boyinapalli Market Issues | బోయిన్పల్లి మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ ఈటల

