అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Traffic Relief | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్ (CP Sajjanar) తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ముగ్ధ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనులను శుక్రవారం సీపీ సజ్జనార్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయన్నారు.
Hyderabad Traffic Relief | సిగ్నల్ ఫ్రీగా..
కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ (Hyderabad Traffic Relief) రాకపోకల కోసం రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించనున్నట్లు సీపీ తెలిపారు. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. శుక్రవారం రాత్రి నుంచే ముగ్ధ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే మార్గంలో ఆరు పిల్లర్ల నిర్మాణ పనులకు ప్రారంభం అవుతాయన్నారు.
Hyderabad Traffic Relief | రాత్రిపూట..
పగటి పూట ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పనులు రాత్రివేళల్లోనే చేపడుతారని పోలీస్ బాస్ తెలిపారు. పునాది పనులు పూర్తయ్యే వరకు మాత్రమే రాకపోకలకు కొంతమేర అసౌకర్యం ఉంటుందన్నారు. ఆ తర్వాత వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పార్క్ (KBR Park) పరిసరాలు పూర్తిగా సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా మారుతాయని చెప్పారు.
ట్రాఫిక్ ఆంక్షలు
నిర్మాణ పనుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు. ప్రజలు రద్దీని నివారించేందుకు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించుకోవాలన్నారు. పనులు ప్రారంభమైన రెండు, మూడు రోజుల అనంతరం.. అవసరమైన మార్గాల్లో మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అడ్వైజరీలు జారీ చేస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్

