అక్షరటుడే, వెబ్‌డెస్క్: YouTuber Komali Death | హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో బంధువుల ఇంట్లో నివసిస్తున్న 21 ఏళ్ల యువ యూట్యూబర్ కోమలి Komali ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కోమలి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన యువతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్‌టైమ్‌గా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. లైఫ్‌స్టైల్, రోజువారీ వ్లాగ్స్, వ్యక్తిగత అనుభవాలపై రూపొందించిన వీడియోలతో యువతలో మంచి అనుచరగణం సంపాదించింది.
YouTuber Komali Death | అఖిల్ రెడ్డితో తేడా వచ్చిందా..
దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, సాఫ్ట్‌వేర్ Software ఉద్యోగం చేస్తున్న మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో కోమలికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. సుమారు మూడు సంవత్సరాల పాటు కొనసాగిన ఈ బంధం ఏడాది క్రితం మనస్పర్థల కారణంగా ముగిసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బ్రేకప్ తర్వాత కోమలి తీవ్ర భావోద్వేగ ఒత్తిడికి లోనైందని సమాచారం. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకుని కాపాడినట్లు తెలిసింది. ఇటీవల మళ్లీ ఇద్దరి మధ్య సంభాషణలో వాగ్వాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ పరిణామాలు ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
YouTuber Komali Death | సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల కోమలి తిరుమలకు Tirumala కాలినడకన వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ చేసిన ఆ పాదయాత్ర వీడియో ఆమె చివరి పోస్టుగా నిలిచినట్లు సమాచారం. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులను ప్రశ్నిస్తూ అసలు కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. సోషల్ మీడియా ఒత్తిడి, వ్యక్తిగత సంబంధాల ప్రభావం వంటి అంశాలపై కూడా పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన యువతలో పెరుగుతున్న భావోద్వేగ ఒత్తిడి, సంబంధాల్లో ఏర్పడే విభేదాలు ఎంతటి విషాదాలకు దారితీస్తున్నాయో మరోసారి గుర్తుచేసింది.
ఇది కూడా చదవండి..: Ramakrishnan Case | మైనర్ అక్కాచెల్లెళ్లపై దారుణం.. జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

