అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa saves parks | ఆక్రమణలపై హైడ్రా (Hydraa) కఠిన చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలతో పాటు, పార్కు స్థలాలను కబ్జాల నుంచి రక్షిస్తోంది. గురువారం రెండు పార్కులను హైడ్రా అధికారులు కాపాడారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్పూర్లో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 152, 153లలో 15 ఎకరాల మేర 144 పాట్లతో శ్రీ వెంకటరమణ కాలనీ పేరిట గతంలో లే అవుట్ వేశారు. 15 ఎకరాల్లో వేసిన లే అవుట్‌కు హుడా అనుమతి ఉంది. అయితే తర్వాత అందులో 7 ఎకరాలను వ్యవసాయ భూమిగా అమ్మేశారు. ఈ వివాదం కోర్టులో ఉంది. మిగిలిన 8 ఎకరాల లే అవుట్‌లోని రెండు పార్కులను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
Hydraa saves parks | పార్కు చుట్టూ ఫెన్సింగ్
లే అవుట్‌లో 4,960 గజాలతో ఓ పార్కు, 837 గజాలతో మరో పార్కు ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లే అవుట్ ప్రకారం పార్క్ స్థలాలను గుర్తించి కబ్జా కాకుండా కాపాడారు. ఆ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డు ఏర్పాటు చేశారు. ఆ స్థలాల విలువ దాదాపు రూ. 47 కోట్లవరకూ ఉంటుందని అంచనా.
బాలానగర్ గ్రామంలోని అక్షయ ఎన్‌క్లేవ్ పేరుతో పార్క్ స్థలాన్ని బుధవారం హైడ్రా కాపాడింది. 968 గజాల మేర ఉన్న పార్కును తప్పుడు పత్రాలతో అబ్దుల్ రెహ్మాన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి కాజేయాలని చూశాడు. దీనిపై ఫిర్యాదు అందడంతో పార్కు స్థలంలో ఉన్న సామగ్రిని హైడ్రా సిబ్బంది తొలగించారు.
దీనిని కూడా చదవండి : Huzurabad Dumping Yard | నేను బతికుండగా డంపింగ్ యార్డ్ పెట్టనివ్వను : ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
