అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ilapur Land Scam | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా శనివారం ఉదయం భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలను తొలగించింది. వేలాది మంది అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య న్యాయవాది ముఖీమ్ ఫామ్ హౌజ్, అతడి సోదరుడు అజీమ్ నిర్మించిన ఆరంతస్తుల బిల్డింగ్‌ను నేలమట్టం చేసింది.
హైకోర్టు (High Court) స్టే ఉన్నప్పటికీ, ముఖీమ్ (తన భూ మాఫియా ముఠా ద్వారా) వేలాది ప్లాట్లను ఆక్రమించి, విక్రయించి వందల కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఐలాపూర్ భూములపై 1998లో హైకోర్టు స్టే విధించింది. అయినా కూడా ముఖీమ్, అతని భూ మాఫియా మొదట ఫామ్ హౌజ్ నిర్మించారు. అనంతరం సమీప స్థలాలను ఆక్రమించారు. ముఖీమ్ ఇప్పటివరకు నోటరీల వద్ద వేలాది ప్లాట్లను విక్రయించి వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. అతని ముఠా అక్రమంగా ఏర్పాటు చేసిన వాణిజ్య దుకాణాల నుంచి ప్రతి నెలా కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.
Ilapur Land Scam | రెండు దశాబ్దాలుగా..
ముఖీమ్ తన అనుచరులతో 2 దశాబ్దాలకు పైగా స్థానికంగా మాఫియా రాజ్యాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా ఇన్ని రోజులు అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హైకోర్టు స్టే ఉన్నా.. ముకీమ్ 2006లో ఒక ఫామ్‌హౌస్‌ను నిర్మించాడు. గత సంవత్సరం ఆ ఫామ్‌హౌస్‌ను 40 ఎకరాలకు విస్తరించాడు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. పలువురు అధికారులు సైతం ఆయనకు అనుకూలంగా పని చేసినట్లు సమాచారం.
Ilapur Land Scam | కూల్చివేతలపై స్టే ఇవ్వలేదు
ఐలాపూర్‌లో కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హైడ్రా కూల్చివేతలు నిలిపివేసిందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) ఖండించారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ముఖీమ్ తన ఫామ్‌హౌజ్ కేంద్రంగా ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నట్లు తెలిపారు. 100 గజాలకు రూ.10 లక్షల చొప్పున పేదలకు విక్రయించాడన్నారు.
Ilapur Land Scam | స్థానికుల హర్షం
ఐలాపూర్‌లో కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కాపాడిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫొటోకు పాలాభిషేకం చేశారు. కాగా గ్రామంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో ఇప్పటికే కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు వాటి జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడారు.
ఇది కూడా చదవండి..: Mohammed Abdul Malik | నాటి అక్షరాల ఆరాటం.. నేటి ఆచార్య కిరీటం.. ఆదర్శం ఫ్రొఫెసర్ మాలిక్ జీవన ప్రయాణం!
