అక్షరటుడే, వెబ్డెస్క్ : Illegal Water Motors | రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం తాగునీటి కొరత ఉంది. జల మండలి అధికారులు నీటిని సరఫరా చేస్తున్నా.. కొందరు మోటార్లు పెట్టి అధికంగా నీటిని వినియోగించుకుంటున్నారు. దీంతో మిగతా ప్రాంతాలకు నీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నల్లాలకు అక్రమంగా మోటార్లు పెట్టే వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. నల్లాలకు పెట్టిన మోటార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని జరిమానా సైతం విధిస్తున్నారు. తాజాగా బుధవారం ఉదయం పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా పెట్టిన మోటార్లు సీజ్ (Motors Seized) చేశారు.
Illegal Water Motors | చట్టరీత్యా నేరం
జలమండలి అధికారులు మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ (GHMC)తో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించుకుంటున్నారని చెప్పారు. దీంతో మిగిలిన వినియోగదారులకు తక్కువ ప్రెజర్తో నీటి సరఫరా జరుగుతోందన్నారు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో జలమండలి విజిలెన్స్ అధికారులు (Vigilance Officers) తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Illegal Water Motors | 7 మోటార్లు స్వాధీనం
జలమండలి పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లను అధికారులు సీజ్ చేశారు. బుధవారం ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీ (SRT Colony)లో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు జలమండలి విజిలెన్సు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. మొదటి సారి పట్టుబడితే మోటారు సీజ్ చేస్తామని, రెండో సారి దొరికితే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Road Accident | బైక్ను ఢీకొన్న కారు.. ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
