అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Economic Resilience | అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం ప్రభావం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది. ఇన్ఫ్లేషన్ భయాలు పెరుగుతున్నాయి. అన్ని దేశాలు ఇంధన సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పదిలంగానే ఉందని ఆర్‌బీఐ (RBI) పేర్కొంటోంది. విదేశీ కుదుపుల నుంచి దేశాన్ని రక్షించేందుకు మనవద్ద విదేశీ మారకపు నిల్వలు తగినన్ని ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన మార్చి బులెటిన్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ బులెటిన్‌లో ఇచ్చిన విషయాలు ఆర్‌బీఐ అధికారిక ప్రకటన కిందకు రాకపోవడం గమనార్హం.
India Economic Resilience | క్రూడ్ ఆయిల్ ధర ప్రభావం..
ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఆగకుండా కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడంతో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా పెరిగాయి. మూడు వారాల్లోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 78 డాలర్ల నుంచి 110 డాలర్లకు చేరింది. గ్యాస్ సరఫరా తగ్గడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచాయి. ఇన్ఫ్లెషన్ పెరిగితే వడ్డీ రేట్లను పెంచే యోచనలోనూ ఉన్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88.6 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
India Economic Resilience | అదుపులోనే ద్రవ్యోల్బణం
రిటెయిల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) జనవరిలో 2.7 శాతంగా ఉండగా ఫిబ్రవరిలో 3.2 శాతానికి పెరిగింది. ఆహారం, పానీయాల ద్రవ్యోల్బణం పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇంధనం, ఆహారం తదితరాలను మినహాయించి చూసే కోర్ ద్రవ్యోల్బణం (విలువైన ఆభరణాలు మినహాయించి) 1.9 శాతం వద్ద నిలకడగా కొనసాగుతుండడం మార్కెట్లకు ఊరటనిచ్చే అంశం. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగి ముడి చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లపైన కొనసాగితే ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదం ఉంది.

India Economic Resilience | జీడీపీ వృద్ధి 7.6 శాతం..
నూతన ఆధార సంవత్సరం(బేస్ ఇయర్) 2022-23 ప్రకారం దేశ వాస్తవ జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదవుతుందని అంచనా. దేశీయ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడుల కార్యకలాపాలు బలంగా ఉండడంతో మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు ఏకంగా 7.8 శాతంగా నమోదైంది. వ్యవసాయ, తయారీ రంగాలతో పాటు సేవా రంగమూ అద్భుతమైన పనితీరు చూపించాయి. అయితే అమెరికా (America), ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు దీర్ఘ కాలం కొనసాగితే దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడి, జీడీపీ వృద్ధి సైతం మందగించే అవకాశాలున్నాయి.
India Economic Resilience | సరిపడా విదేశీ మారకపు నిల్వలు..
2024-25తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు స్వల్పంగా పెరిగింది. ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం దీనికి కారణం. కరెన్సీ కూడా ఆందోళన కలిగించేలా రోజురోజుకూ పతనమవుతోంది. మరోవైపు ఎఫ్ఐఐలు దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరిస్తున్నారు. దీంతో మన విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయి. మార్చి 13 నాటికి విదేశీ మారక నిల్వలు 709.76 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మన వద్ద ఉన్న విదేశీ మారకపు నిల్వలు సుమారు 11.2 నెలల దిగుమతులకు సరిపోతాయని ఆర్‌బీఐ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. ప్రపంచ సరఫరా గొలుసు వ్యవస్థలు, ముడి చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి, వాణిజ్య సవాళ్లు నెలకొన్నప్పటికీ, పటిష్ఠమైన స్థూల ఆర్థిక పునాదులు, బలమైన విదేశీ మారక నిల్వల కారణంగా ఎలాంటి ఇబ్బందులకైనా ఎదురొడ్డి నిలబడే సామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని ఆ నివేదిక స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: India War Challenges | యుద్ధంతో భారత్‌కు సవాళ్లు.. గ్యాస్, పెట్రోల్‌పై మోదీ కీలక ప్రకటన

