అక్షరటుడే, న్యూఢిల్లీ: India LPG Supply Restrictions | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు, Iran – Israel మధ్య నెలకొన్న ఘర్షణలు, United States జోక్యం నేపథ్యంలో భారత దేశంలో ఇంధన భద్రతపై కేంద్ర సర్కారు అప్రమత్తమైంది. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన సరఫరాపై ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ (Liquefied petroleum gas – LPG) గ్యాస్ సరఫరాపై దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.
India LPG Supply Restrictions | కంపెనీలకు ఆదేశాలు..
కేంద్ర సర్కారు ఆదేశాల ప్రకారం.. ఎల్పీజీ సిలిండర్లను గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల అస్థిరత, సరఫరా గొలుసుపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో చమురు, గ్యాస్ రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎల్పీజీని గృహ వినియోగదారులకు మొదటి ప్రాధాన్యంగా అందించాలని ఆదేశించింది. వాణిజ్య సంస్థలు, హోటళ్లు, చిన్న పరిశ్రమలకు సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ పంపిణీపై కొంత నియంత్రణ ఉండే ప్రమాదం ఉందని సమాచారం. పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయాలు ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
India LPG Supply Restrictions | ఆందోళన వద్దు..
దేశంలోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ సంస్థలైన Hindustan Petroleum Corporation Limited (HPCL), Indian Oil Corporation (IOCL), Bharat Petroleum Corporation Limited (BPCL) లకు తాజాగా కేంద్ర సర్కారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎల్పీజీ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు, గ్యాస్ సరఫరా పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైతే దేశీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైనంత గ్యాస్ నిల్వలు దేశంలో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

