అక్షరటుడే, హైదరాబాద్: Mutual Fund Industry | భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఫిబ్రవరి 2026 నాటికి సరికొత్త శిఖరాలను తాకింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం పరిశ్రమ నికర నిర్వహణ ఆస్తుల విలువ రూ. 82,02,956.35 కోట్లకు చేరుకుంది. అంతకుముందు జనవరి నెలలో ఈ విలువ రూ. 81,01,305.58 కోట్లుగా ఉండగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే భారీ వృద్ధి నమోదైంది. సగటు నిర్వహణ ఆస్తుల విలువ కూడా రూ. 83,42,616.57 కోట్లుగా నమోదై పెట్టుబడిదారుల నమ్మకాన్ని చాటుతోంది.
Mutual Fund Industry | 27.05 కోట్లకు మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు
పెట్టుబడిదారుల భాగస్వామ్యం విషయానికి వస్తే మొత్తం మ్యూచువల్ ఫండ్ ఫోలియోల సంఖ్య 27.05 కోట్లకు చేరింది. ఫిబ్రవరి నెలలో కొత్తగా 42.58 లక్షల ఫోలియోలు జతకావడం విశేషం. ముఖ్యంగా రిటైల్ విభాగంలో ఈక్విటీ హైబ్రిడ్ పథకాలపై ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. రిటైల్ నిర్వహణ ఆస్తుల విలువ రూ. 47,14,392 కోట్లుగా ఉంది. మార్చి 2021 నుండి వరుసగా 60వ నెలలో కూడా ఈక్విటీ ఫండ్లలోకి సానుకూల ప్రవాహం కొనసాగడం మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది.

Mutual Fund Industry | సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా వచ్చే పెట్టుబడులు పరిశ్రమకు వెన్నెముకగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో ఎస్ఐపీ కాంట్రిబ్యూషన్ రూ. 29,845 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం మొత్తం పరిశ్రమ ఆస్తులలో ఎస్ఐపీల వాటా సుమారు 20.3 శాతానికి చేరింది. ఫిబ్రవరి తక్కువ రోజులు ఉన్న నెల కావడం వల్ల జనవరితో పోలిస్తే స్వల్ప మార్పు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ల క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే నెలలో కొత్తగా 22 స్కీమ్‌లను ప్రారంభించి రూ. 5,357 కోట్లను సేకరించారు. సోషల్ ఇంపాక్ట్ ఫండ్స్ విభాగం కూడా 47.9 శాతం వృద్ధితో గణనీయమైన పురోగతిని సాధించింది.
ఇది కూడా చదవండి..: Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

