అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు. ఈ పథకం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఏప్రిల్–మే నెలల్లో రెండో విడుత ప్రారంభిస్తామన్నారు.
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతి ఏటా అమలు చేసే ఒక నిరంతర ప్రక్రియ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. గృహనిర్మాణ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపికను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
Indiramma Housing Scheme | ప్రత్యేక ప్రణాళిక
గతంలో వివిధ దశల్లో నిలిచిపోయిన గిరిజన, మారుమూల గ్రామాల్లోని ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల సౌలభ్యం కోసం నిర్మాణ దశల్లో వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. అత్యంత నిరుపేదలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వస్తే, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Indiramma Housing Scheme | పట్టణ ప్రాంతాల్లో..
మార్చి చివరి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి అంచనా వేశారు. పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. లబ్ధిదారుల జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి సాధ్యమైనంత దగ్గరలోనే గృహాలను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. డబుల్ బెడ్ రూం పథకం కింద చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో 99 శాతాన్ని ఇప్పటికే క్లియర్ చేశామని తెలిపారు. వివిధ దశలలో పెండింగ్‌లో ఉన్న డబుల్ ఇళ్లను పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు అప్పగించేందుకు 99 రోజుల కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: KTR in Assembly | మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్

