అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Acting Supreme Leader | ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఖమేనీ (Khameni) సన్నిహితుడు ఆయుతుల్లా అలీరెజా అరాఫీ (Alireza Arafi) ఎంపికయ్యారు. ఇరాన్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు దీరింది.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తుంది. ఈ సమయంలో ఆ దేశానికి సుప్రీం లీడర్‌గా అనుభవజ్ఞుడైన మతాధికారి, ఖమేనీ సన్నిహితుడు అయిన ఆయతుల్లా అరాఫీని ఎంపిక చేశారు. సుప్రీం లీడర్ పాత్రను తాత్కాలికంగా నిర్వర్తించే నాయకత్వ మండలిలో అరాఫీని న్యాయశాస్త్ర సభ్యుడిగా నియమించారు. ముగ్గురు సభ్యుల ఈ మండలిలో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలాంహోస్సేన్ ʹమొహ్సేని ʹఎజీ కూడా ఉన్నారు.
Iran Acting Supreme Leader | అరాఫీ నేపథ్యం..
అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత పదవికి పోటీపడే వారిలో అరాఫీ ఒకరు. 67 ఏళ్ల ఆయన అనుభవజ్ఞుడైన మతాధికారి, అంతేగాకుండా ఖమేనీ సన్నిహితుడు. అరాఫీ ప్రస్తుతం సుప్రీం లీడర్‌ను నియమించే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో గార్డియన్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. ఆయన ఇరాన్ (Iran) సెమినరీ వ్యవస్థకు కూడా నాయకత్వం వహిస్తారు. ఆయనకు భద్రతా సంస్థతో బలమైన సంబంధాలకు లేవని తెలుస్తోంది.
Iran Acting Supreme Leader | విస్తృత అధికారాలు
ఇరాన్లో సుప్రీం నాయకుడు అపారమైన, విస్తృత అధికారాలను కలిగి ఉంటారు. దేశానికి సంబంధించిన అన్ని విషయాలపై తుది నిర్ణయం ఆయనదే. సుప్రీం లీడర్ దేశ సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా సైతం వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు ఇరాన్లో ఇద్దరు సుప్రీం లీడర్లు మాత్రమే పని చేశారు. మొదట ఆయతుల్లా రుహోల్లా ఖమేనీ సుప్రీం నాయకుడిగా వ్యవహరించారు. అనంతరం ఆ బాధ్యతలను ఆయతుల్లా అలీ ఖమేనీ చేపట్టి నాలుగు దశాబ్దాలు కొనసాగారు.
త్వరలో కొత్త నాయకుడు
ఇరాన్ చట్టం ప్రకారం వీలైనంత త్వరగా సుప్రీం లీడర్‌ను ఎన్నుకోవాలి. తుది పేరు వెల్లడి అయ్యే వరకు, ఒక కౌన్సిల్ రంగంలోకి దిగి తాత్కాలికంగా నాయకత్వ విధులను నిర్వర్తిస్తుంది. దీంతో ప్రస్తుతం తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అరాఫీ పేరు ప్రకటించారు. 88 మంది సభ్యులతో కూడిన నిపుణుల సభ సుప్రీం లీడర్‌ను నియమిస్తుంది. అతడు షియా మతాధికారి అయి ఉండాలి.
ఇది కూడా చదవండి : Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి

