అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Gulf Attacks | గల్ఫ్ దేశాలపై ఇరాన్ పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. ఆయా దేశాల్లోని అమెరికా (America) మిలటరీ స్థావరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని క్షిపణులను ప్రయోగించింది.
ఇరాన్‌పై శనివారం ఉదయం ఇజ్రాయెల్ (Israel), అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని (Iran Gulf Attacks) అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది. బహ్రెయిన్, కువైట్ (Kuwait), ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా అనేక లక్ష్యాలపై తన దాడులను ఇరాన్ ప్రభుత్వం శనివారం ధృవీకరించింది. మధ్యప్రాచ్యంలోని అన్ని ఇజ్రాయెల్, యూఎస్ సైనిక లక్ష్యాలు “ఇరానియన్ క్షిపణుల శక్తివంతమైన దాడులకు” గురయ్యాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పేర్కొంది.
Iran Gulf Attacks | బంగారం ధరలకు రెక్కలు
ఇరాన్ దాడులతో బంగారం (Gold), వెండి ధరలు (Silver Prices) భారీగా పెరిగాయి. కొంతకాలంగా బంగారం, వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించడంతో పసిడి ధర శనివారం ఒక్కరోజే రూ.7 వేలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,68,710 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.6,550 పెరిగి రూ.1,54,650కు చేరింది. వెండి ఏకంగా రూ.25 వేలు పెరగడం గమనార్హం. దీంతో మరోసారి రూ.3 లక్షల మార్క్ దాటేసింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రూ.3,20,000గా ఉంది.
36 మంది విద్యార్థులు మృతి
సౌత్ ఇరాన్‌లోని మినాబ్ సిటీలో ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్‌పై ఇరాన్ బాంబులు వేసింది. ఈ ఘటనలో 36 మంది విద్యార్థులు మృతి చెందారు. శిథిలాల కింద చిన్నారుల మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయి. కాగా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా.. గల్ఫ్ దేశాల్లోని ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. శత్రువు ఓడిపోయే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన అనేక మిసైళ్లను అడ్డుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. బహ్రెయిన్‌లోని యూఎస్ నేవీ 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడి జరిగినట్లు ఆ దేశం తెలిపింది.
అమెరికా సైనిక కేంద్ర కమాండ్ ప్రధాన కార్యాలయం ఉన్న కువైట్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. తమ దేశం వైపు దూసుకొచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖతార్, కువైట్ యూఏఈ అన్నీ తమ గగనతలాలను మూసివేశాయి.

