అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran US tensions | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన తాజా హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. తమ దేశంలోని విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (Iran’s Revolutionary Guards) స్పష్టం చేసింది.
Iran US tensions | హర్మూజ్ జలసంధి మూతపడటంతో..
కేవలం సైనిక స్థావరాలే కాకుండా, అమెరికా అనుబంధ ఐటీ వ్యవస్థలు, తాగునీటి శుద్ధి కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడటం ఇప్పటికే అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ ఘాటుగా స్పందిస్తూ, తమ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతంలోని కీలక వ్యవస్థలన్నీ కోలుకోలేని విధంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.
Iran US tensions | జలసంధి చుట్టూ రాజకీయం..
అంతేకాకుండా, తమ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా పునర్నిర్మించే వరకు హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఒక్క చమురు ట్యాంకర్‌ను కూడా ముందుకు కదలనివ్వబోమని చెప్పడం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సంక్షోభం ప్రభావం ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. గత ఫిబ్రవరి 28 నుంచి జలసంధి మూతపడటంతో గ్లోబల్ ఇంధన సరఫరా అంతరాయం కలిగింది. ఫలితంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 119 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో ఇరాన్-ఇజ్రాయెల్ (Israel) మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగి, క్షిపణి దాడులు కొనసాగుతుండగా, లెబనాన్ నుంచి హెజ్బొల్లా దాడులు కూడా మధ్యప్రాచ్యాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టుతున్నాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం, ట్రంప్ విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు (White House Officers) మిత్రదేశాలతో అత్యవసర చర్చలు జరుపుతున్నారు. ఇరాన్ తీరానికి సమీపంలో అమెరికా బాంబర్ విమానాలు గస్తీని ముమ్మరం చేయడం గమనార్హం. ఈ పరిణామాల మధ్య గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.
ఇది కూడా చదవండి..: Hormuz Strait Ultimatum | హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం

