అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IRCTC boarding change | రైల్వే ప్రయాణికులకు తమ బోర్డింగ్ స్టేషన్ మార్పు చేసుకునే విషయంలో రైల్వే శాఖ మరింత వెసులుబాటు కల్పించింది. బోర్డింగ్ స్టేషన్ (Boarding Station) మార్పునకు సంబంధించిన నిబంధనలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రైన్ కదిలే అరగంట ముందు వరకు తమ బోర్డింగ్ పాయింటును మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది.
IRCTC boarding change | ఆన్‌లైన్ తోపాటు ఆఫ్ లైన్ లోనూ..
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణానికి అరగంట ముందు కూడా బోర్డింగ్ పాయింట్ మార్చుకునే వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందువరకు రైలు ప్రయాణికులు తమ బోర్డింగ్ పాయింట్ మార్పు రిక్వెస్టును రైలు కదిలేందుకు 24 గంటల ముందు పంపించాల్సి ఉండేది. దీనిని 30 నిమిషాలకు తగ్గించారు. అనుకోని కారణాల వల్ల సంబంధిత స్టేషన్‌లో రైలు అందుకోలేమనుకొన్నప్పుడు 30 నిమిషాల ముందు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడం ద్వారా ఆదరబాదరగా ట్రైన్ ఎక్కాల్సిన అవసరం తప్పుతుంది. అప్‌డేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకు ఈ విషయంలో మరింత సౌలభ్యం ఏర్పడింది. ప్రయాణింకులు ఇకపై ఐఆర్‌సీటీసీ యాప్ (IRCTC App) లేదా అధికారిక వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారానూ బోర్డింగ్ పాయింట్ మార్పును పూర్తి చేయవచ్చు.
IRCTC boarding change | సెకండ్ చార్ట్‌లో వివరాలు..
బోర్డింగ్ పాయింట్‌కు సంబంధించి సవరించిన నిబంధనల ప్రకారం ఇకపై ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ (Railway Station)పేరు ఫస్ట్ చార్ట్‌లో కనిపించదు. ట్రైన్ బయలుదేరడానికి కొంతసేపటి ముందు రూపొందించే సెకండ్ రిజర్వేషన్ చార్టులో ఆ వివరాలు కనిపిస్తాయి. కన్ఫామ్ లేదా ఆరఏసీ ఉన్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకోవడానికి వీలుంటుంది. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లకు ఈ అవకాశం ఉండదు. ఒకసారి మాత్రమే బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి వీలుంటుంది. అదీ రెండో చార్ట్ ప్రీపేర్ అయ్యేలోపే రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
IRCTC boarding change | ఎలా మార్చుకోవాలంటే..
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ (Book Tickets Online) చేసుకున్న వారు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోకి వెళ్లాలి. మై అకౌంట్‌లో మై ట్రాన్సాక్షన్స్‌పై క్లిక్ చేసి బుక్డ్ టికెట్ హిస్టరీని చూడాలి. అందులో టికెట్‌ను ఎంపిక చేసుకుని చేంజ్ బోర్డింగ్ పాయింట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ట్రైన్ వెళ్లే రూట్‌లోని వేరే స్టేషన్‌ను బోర్డింగ్ పాయింట్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఓకే బటన్‌పై క్లిక్ చేస్తే టికెట్ బోర్డింగ్ పాయింట్ మారుతుంది. ఆ తర్వాత ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో టికెట్ తీసుకుని ఉంటే సమీపంలోని రైల్వే కౌంటర్‌కు వెళ్లి టికెట్, గుర్తింపు కార్డు చూపించి, బోర్డింగ్ పాయింటు మార్చుకోవచ్చు.
ఇది కూడా చదవండి..: Credit Card IT Rules | క్రెడిట్ కార్డ్‌ను తెగ వాడేస్తున్నారా?.. అయితే ఐటీ చుట్టాలను ఆహ్వానించినట్లే!
