అక్షరటుడే, వెబ్డెస్క్: IRCTC South India Tour | యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ సూపర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. వేసవి సమీపించింది. త్వరలో కాలేజీలు, బడులకు సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మంది పలు పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించాలని భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ దివ్య దక్షిణయాత్ర- అరుణాచలం- చిదంబరం పేరిట ఓ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.
ఈ ప్యాకేజీలో ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు యాత్ర ఉంటుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించడానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావుర్, చిదంబరం ప్రాంతాలను యాత్రలో చుట్టి రావొచ్చు. టికెట్ రేటు రూ.14,500 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ నుంచి మే 24న బయలు దేరుతుంది. జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్ల (Renigunta Railway Stations)లో హాల్టింగ్ ఉంది. ఆయా స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కవచ్చు.

IRCTC South India Tour | టూర్ ఇలా..
సికింద్రాబాద్ (Secunderabad) నుంచి మే 24న మధ్యాహ్నం 12 గంటలకు రైలు ప్రారంభం అవుతుంది. మొదట అరుణాచలం (Arunachalam) దర్శనం చేసుకుంటారు. అనంతరం రామేశ్వరం పయనం అవుతారు. రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో తీసుకెళ్తారు. మీనాక్షి అమ్మవారిని దర్శనం అనంతరం స్థానికంగా షాపింగ్ చేసే వీలు ఉంటుంది. అనంతరం కన్యాకుమారికి వెళ్తారు. ఆరో రోజు శ్రీరంగనాథస్వామి ఆలయం, తంజావూర్ (Thanjavur)లోని బృహదీశ్వర ఆలయ దర్శనం చేయిస్తారు. చివరి రోజు చిదంబర నటరాజ స్వామి దర్శనం అనంతరం యాత్రికులు తిరుగు పయనం అవుతారు.
IRCTC South India Tour | టికెట్ ధరలు
ప్రత్యేక రైలు (Special Train)లో యాత్రికులు వివిధ విభాగాల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఎకానమీ (స్లీపర్ క్లాస్) ఒక్కో టికెట్ ధర రూ.14,500. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.13,500గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా బస చేసే హోటల్‌లో నాన్‌ఏసీ గదులు కేటాయిస్తారు. నాన్ ఏసీ వాహనాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. థర్డ్ ఏసీ టికెట్ ధర పెద్దలకు రూ.21,700, పిల్లలకు రూ.20,600గా ఉంది. రాత్రిపూట బసకు ఏసీ గదులు కేటాయిస్తారు. సెకండ్ ఏసీ ధర పెద్దలకు రూ.27,900, పిల్లలకు రూ.26,600.
IRCTC South India Tour | భోజనం కూడా..
ప్యాకేజీలో భాగంగా ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం (శాకాహారం) రైల్వే సిబ్బందే ఏర్పాటు చేస్తారు. బుక్ చేసుకున్న టికెట్లను బట్టి ప్రయాణికులకు స్థానికంగా ఏసీ, నాన్ ఏసీ వాహనాలను సమ కూరుస్తారు. ఆయా పర్యాటక కేంద్రాల్లో ప్రవేశ రుసుములు ఉంటే మాత్రం యాత్రికులు చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..: IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా

