అక్షరటుడే, వెబ్‌డెస్క్: ISIS Threat Hindus | భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) అనుబంధ నెట్‌వర్క్‌లు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని పిలుపునిచ్చినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ కౌంటర్ ఎక్స్‌ట్రీమిజం ప్రాజెక్ట్ (CEP) తన నివేదికలో పేర్కొంది.
సీఈపీ తెలిపిన వివరాల ప్రకారం, మార్చి 9న ఐసిస్‌కు మద్దతుగా ఉన్న ఒక యూజర్ సోషల్ మీడియా (Social Media) వేదికలో హిందువులపై దాడులు చేయాలని పిలుపునిచ్చాడు. ఆ సందేశంలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో పాటు భారత్‌లోని పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పోస్టు అనంతరం అదే సందేశాన్ని ఇతర ఆన్‌లైన్ వేదికల్లో కూడా షేర్ చేయడంతో తీవ్రవాద అనుచరుల మధ్య వేగంగా వ్యాపించినట్లు నివేదిక పేర్కొంది.
ISIS Threat Hindus | కాల్పులకి పాల్పడిన వ్యక్తి అమరవీరుడు..
ముఖ్యంగా ‘రాకెట్‌చాట్’ వంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ సందేశాన్ని విస్తృతంగా పంచుకున్నట్లు సమాచారం. దీంతో దక్షిణాసియా ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగవచ్చని భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, అమెరికా (America)లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను కూడా ఐసిస్ మద్దతుదారులు ఆన్‌లైన్‌లో ప్రశంసించినట్లు సీఈపీ నివేదిక తెలిపింది. న్యూయార్క్ (New York)లో మార్చి 7న జరిగిన దాడి యత్నం మరియు మార్చి 12న ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీ (Old Dominion University)లో జరిగిన కాల్పుల ఘటనలను వారు సోషల్ మీడియాలో వేడుకలా జరుపుకున్నట్లు వెల్లడైంది. యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని ‘అమరవీరుడు’గా కీర్తిస్తూ పోస్టులు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ISIS Threat Hindus | ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించి విరాళాలు
ఇక ఆ వ్యక్తి గతంలో ఐసిస్‌కు సహకరించేందుకు ప్రయత్నించిన కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవించినట్టు కూడా నివేదికలో వెల్లడైంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు మళ్లీ తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఐసిస్ అనుచరులు ఆన్‌లైన్ వేదికలను ఉపయోగించి విరాళాలు సేకరించడంతో పాటు కొత్త సభ్యులను నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా సీఈపీ పేర్కొంది. మార్చి 8 నుంచి 11 మధ్య కాలంలో ఐసిస్ అనుబంధ నెట్‌వర్క్‌ల దాడులను ప్రోత్సహించే విధంగా నాలుగు ప్రచార వీడియోలను విడుదల చేసినట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు క్షేత్రస్థాయిలో కూడా ఐసిస్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మార్చి 8 నుంచి 14 మధ్య కాలంలో నైజీరియా, కాంగో, సిరియా, పాకిస్థాన్ వంటి దేశాల్లో మొత్తం 24 దాడులు జరిపినట్లు ఆ సంస్థ ప్రకటించుకుంది.
ISIS Threat Hindus | దక్షిణాసియా ప్రాంతంలో
ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంతంలో భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రవాద ప్రచారాన్ని ఆన్‌లైన్‌లోనే అణచివేయడం, అంతర్జాతీయ సహకారంతో నెట్‌వర్క్‌లను గుర్తించడం అత్యంత కీలకమని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: BJP Bengal Candidates | బెంగాల్‌పై బీజేపీ ఫోకస్.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

