అక్షరటుడే, వెబ్‌డెస్క్: Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్ మున్సిపాలిటీలో తాజా ఘటనతో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. పార్టీ మార్పిడి ఆరోపణల నేపథ్యంలో 8వ వార్డు కౌన్సిలర్ మాధవి నరేందర్‌రెడ్డి పదవిని జిల్లా ఎన్నికల అధికారి రద్దు చేశారు. ఈ మేరకు మంగళవారం (మార్చి 03) ఉత్తర్వులు జారీ చేశారు.
Isnapur Councillor Disqualified | పార్టీ విప్ ఉల్లంఘన?
కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్‌గా గెలిచిన మాధవి నరేందర్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్టీ విప్ జారీ చేసినప్పటికీ, మాధవి విప్‌ను ఉల్లంఘించి ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పేర్కొంది.
విప్ ఉల్లంఘన వ్యవహారంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం, 2019లోని సెక్షన్ 20(2) ప్రకారం మాధవిని అనర్హురాలిగా ప్రకటించాలని కోరారు.
Isnapur Councillor Disqualified | ఎన్నికల అధికారి నిర్ణయం
డీసీసీ అధ్యక్షురాలి ఫిర్యాదును పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, చట్టప్రకారం మాధవిని కౌన్సిలర్ పదవికి అనర్హురాలిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిమాణంతో మాధవి కౌన్సిలర్ పదవి రద్దు అయింది. ఈ ఘటనతో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని స్థానిక రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

