అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Israel Iran Attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా (America), ఇజ్రాయెల్ (Israel) ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తుండగా.. టెహ్రాన్ సైతం ధీటుగా స్పందిస్తోంది. ఇప్పటి వరకు యుద్ధంలో 1300 మందికి పైగా మృతి చెందారు.
ఇరాన్‌లోని ఆయిల్ స్టోరేజ్ ట్యాంకులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఆదివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున దాడులు చేసింది. టెహ్రాన్ (Tehran) సమీపంలోని 30 పెద్ద ఆయిల్ రిఫైనరీలు, స్టోరేజ్ సైట్లపై క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ పేలుడు చోటు చేసుకొని దట్టంగా పొగ కమ్మేసింది. యుద్ధం మొదలైన తర్వాత ఇంధన మౌలిక సదుపాయాలపై ఇది అతి పెద్ద దాడి కావడం గమనార్హం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
Israel Iran Attacks | టెహ్రాన్ ఓడిపోయింది
టెహ్రాన్, బీరుట్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. శనివారం దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ల దాడి చేసింది. ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో టెహ్రాన్ విరుచుకు పడుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది. అయితే యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. టెహ్రాన్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.
మినాబ్‌లో బాలికల పాఠశాలపై దాడి జరగడంతో 150 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ దాడుల్లో విద్యార్థులు చనిపోయారని ఇరాన్ తెలిపింది. ట్రంప్ మాట్లాడుతూ.. ఇరానే ఈ దాడి చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వారి ఆయుధాలకు కచ్చితత్వం, గురి సరిగా లేదని పేర్కొన్నారు.
Israel Iran Attacks | కువైట్‌పై..
కువైట్‌లోని కీలక భవనాలపై ఇరాన్ దాడులు చేసింది. సోషల్ సెక్యూరిటీ భవనంపై, విమానాశ్రయం వద్ద రెండు చమురు డిపోలపై డ్రోన్లను ప్రయోగించింది. మరోవైపు ఇరాన్‌లోని సైనిక స్థావరాలను టెల్ అవీవ్ టార్గెట్ చేసింది. కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడులను గల్ఫ్ సహకార మండలి ఖండించింది.

