అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jeevan Reddy Resignation | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీని వీడనున్నారు. ఈ నెల 25న ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. ఆ రోజు నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కొంతకాలంగా కాంగ్రెస్ (Congress)పై అసంతృప్తితో ఉన్నారు. పార్టీ తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన పలు వేదికలపై ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఓడిపోయారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సంజయ్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. జీవన్‌రెడ్డిని దాదాపు పట్టించుకోవడం మానేసింది. దీంతో పలుమార్లు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు ఆయనను సముదాయించినా వెనక్కి తగ్గలేదు.
Jeevan Reddy Resignation | మున్సిపల్ ఎన్నికల్లో..
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) జీవన్‌రెడ్డి వర్గానికి అన్యాయం జరిగింది. సంజయ్ మద్దతుదారులకు ఎక్కువ సీట్లు ఇచ్చిన కాంగ్రెస్, జీవన్‌రెడ్డి అనుచరులకు టికెట్లు ఇవ్వలేదు. దీంతో ఆయన మద్దతుదారులను స్వతంత్రంగా పోటీ చేయించి గెలిపించారు. అనంతరం పంచాయితీ కాంగ్రెస్ పెద్దల వద్దకు వెళ్లింది. తన అనుచరులకు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పట్టించుకోలేదు. దీంతో పార్టీ మారాలని జీవన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు.
Jeevan Reddy Resignation | అనుచరులతో చర్చించి..
ఇటీవల జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తాను పార్టీ మారుతానని తెలిపారు. ఉగాది, రంజాన్ తర్వాత అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరుతాననే విషయం ప్రకటిస్తానన్నారు. ఈ క్రమంలో ఆయన రాజీనామాకు తాజాగా ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 25న అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. జగిత్యాల (Jagtial)లోని బండారి గార్డెన్లో మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. కార్యకర్తలు, నాయకులతో భేటీ అనంతరం మూకుమ్మడిగా పార్టీకి, పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. అనుచరులు, నాయకులతో చర్చించిన అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది.
Jeevan Reddy Resignation | ఏ పార్టీలోకి వెళ్తారు
జీవన్‌రెడ్డి రాజీనామా వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. పీసీసీ చీఫ్ జీవన్‌రెడ్డితో మాట్లాడతారని సీఎం శుక్రవారం తెలిపారు. మరోవైపు జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకులను కాపాడుకోవాలని శ్రీధర్‌బాబు అన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఈ వ్యవహారంపై ఇంతవరకు స్పందించలేదు. అయితే జీవన్‌రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ జరుగుతోంది. ఆయన ఈ నెల 27న కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజీపీలోకి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎంపీ అర్వింద్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..: Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య

