అక్షరటుడే, న్యూ ఢిల్లీ: Judiciary Corruption Chapter | సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశం న్యాయ వర్గాలతోపాటు విద్యావేత్తల్లో చర్చనీయాంశంగా మారింది. 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకంలో ఎన్సీఈఆర్టీ (NCERT) “న్యాయవ్యవస్థలో అవినీతి” అంశంపై అధ్యాయం పొందుపర్చింది. దీనిని రూపొందించిన ముగ్గురు నిపుణులపై సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలపై పలువురు న్యాయ, విద్యా నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
Judiciary Corruption Chapter | కోర్టు ఆక్షేపణలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ మార్చి 11న ప్రొఫెసర్ సుపర్ణా దివాకర్, మిషెల్ డానినో, అలోక్ ప్రసన్న కుమార్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ముగ్గురు ఆచార్యులు కూడా భారత న్యాయవ్యవస్థపై సరైన అవగాహన లేకుండా.. లేదంటే కావాలనే వాస్తవాలను తప్పుగా ప్రతిబింబిస్తూ ఎనిమిదో తరగతి విద్యార్థుల ఎదుట న్యాయవ్యవస్థను తప్పుగా చూపించారని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
Judiciary Corruption Chapter | పాఠ్యపుస్తకాల తయారీకి దూరం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ నిధులు పొందే విద్యాసంస్థలు భవిష్యత్తులో పాఠ్యపుస్తకాల రూపకల్పన / సిలబస్ తయారీలో సదరు ముగ్గురు ప్రొఫెసర్లతో ఎలాంటి పనులు పెట్టుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వాదనలు వినకుండానేనా..
అయితే సుప్రీంకోర్టు తాజా ఆదేశంపై కొందరు న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా “ఆడి ఆల్టరం పార్టమ్” (Audi Alteram Partem) అనే న్యాయ సూత్రం ప్రకారం.. ఎవరిపైనా చర్య తీసుకునే ముందు వారికి తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఈ కేసులో సదరు ముగ్గురు విద్యా నిపుణులను పిలిచి వారి అభిప్రాయం వినకుండానే కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాపై సైతం..
ఇక ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో “బాధ్యతారహితంగా” వ్యాఖ్యలు చేస్తున్న వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
న్యాయ వర్గాల్లో చర్చ
ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో సహజ న్యాయం (Natural Justice), వ్యక్తిగత హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృత చర్చకు దారి తీసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ పరిరక్షక సంస్థగా పౌరుల మౌలిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

