అక్షరటుడే, వెబ్‌డెస్క్: Junk Food Cravings | కడుపు నిండా తిన్నాక కూడా చిరుతిళ్లపై మనసు లాగుతుందా? సమయం కాని సమయంలో జంక్ ఫుడ్ తినాలనిపిస్తుందా? ఈ అలవాటు కేవలం నోటి రుచికి సంబంధించింది మాత్రమే కాదు, మీ శరీరంలో దాగి ఉన్న పోషకాహార లోపానికి లేదా ఒత్తిడికి సంకేతం కావచ్చు. ముఖ్యంగా గర్భిణుల్లోనూ, అధిక పని ఒత్తిడి ఉన్నవారిలోనూ కనిపించే ఈ ‘ఆహారపు కోరికల’ను (Food Cravings) శాస్త్రీయంగా ఎలా అదుపు చేయవచ్చో నిపుణులు చెబుతున్న ఈ ఆసక్తికర విషయాలు మీకోసం..
Junk Food Cravings | అతిగా తినాలని ఎందుకు అనిపిస్తుంది?
సాధారణంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మహిళలకు రకరకాల పదార్థాలు తినాలనిపిస్తుంది. అయితే సాధారణ వ్యక్తులలో పని ఒత్తిడి, సరిగ్గా నిద్రపోకపోవడం, శరీరంలో పోషకాలు తగ్గడం లేదా మానసిక స్థితి (Mood Swings) సరిగ్గా లేకపోవడం వల్ల ఈ జంక్ ఫుడ్ వ్యామోహం పెరుగుతుంది. దీనివల్ల అనవసరమైన క్యాలరీలు పెరిగి, చివరికి అది ఊబకాయానికి (Obesity) దారితీస్తుంది.
Junk Food Cravings | ఆహారపు కోరికలను అదుపు చేసే మార్గాలు:
మంచినీళ్లే మందు: ఆకలి వేస్తున్నట్లు అనిపించినప్పుడు ముందుగా గ్లాసు నీళ్లు తాగండి. శరీరంలో తగినంత తేమ ఉంటే అనవసరమైన ఆహారపు కోరికలు దానంతటవే తగ్గుతాయి.
భోజనాల మధ్య విరామం వద్దు: టిఫిన్, లంచ్, డిన్నర్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు పండ్లు, బాదం, వాల్‌నట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల చిరుతిళ్లపై ధ్యాస మళ్లదు.
ప్రొటీన్లకు ప్రాధాన్యం: కార్బోహైడ్రేట్ల కంటే ప్రొటీన్లు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. అందుకే గుడ్లు, పాలు, నట్స్ వంటివి తింటే కడుపు నిండుగా ఉన్న భావన కలిగి, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉంటారు.
ఆస్వాదిస్తూ తినండి: భోజనాన్ని హడావుడిగా కాకుండా, బాగా నమిలి మింగడం వల్ల మెదడుకు త్వరగా తృప్తి కలుగుతుంది. ఇది అతిగా తినే అలవాటును అదుపు చేస్తుంది.
జీవనశైలిలో మార్పులు: ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయండి. కంటి నిండా నిద్ర ఉంటే హార్మోన్లు సమతుల్యంగా ఉండి, వింత ఆహారపు కోరికలు కలగవు.
ఇది కూడా చదవండి: High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!

