అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kaleshwaram Report Verdict | కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ (P.C. Ghosh Commission) ఇచ్చిన నివేదికపై తీర్పు వాయిదా పడింది. ఈ నెల 22వ తేదీన తుది తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది.
బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా అక్రమాలు జరిగాయని నాటి నుంచి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే.. ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాణ్యతపై అనేక అనుమానాలు తలెత్తాయి. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంపై విచారణ జరిపిస్తామని నాడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు.
Kaleshwaram Report Verdict | కమిషన్ విచారణ
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ కమిటీని కాళేశ్వరం విచారణ కోసం నియమించారు. ఈ కమిటీ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు, ఇంజినీర్లు, పనలు చేపట్టిన సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. అంతేగాకుండా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు (Harish Rao), ఈటల రాజేందర్‌ను సైతం విచారించింది. అనంతరం నివేదిక సమర్పించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని కమిషన్ తెలిపింది. ఇష్టానుసారంగా నిర్మాణ స్థలాన్ని మార్చారని ఆరోపించింది.
Kaleshwaram Report Verdict | కోర్టుకు వెళ్లిన కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ నివేదిక అనంతరం ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మరోవైపు ఈ నివేదిక చెల్లదని కేసీఆర్ (KCR), హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలను కోర్టు గతంలోనే విని తీర్పు రిజర్వు చేసింది. బుధవారం తీర్పు చెప్పాల్సి ఉండగా.. ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్లు తాజాగా తెలిపింది. ఘోష్ కమిషన్ రిపోర్ట్ చెల్లుతుందా?.. లేదా, కాళేశ్వరం నివేదికపై హైకోర్టు స్టే ఇస్తుందా అనేది త్వరలో తేలనుంది.
ఇది కూడా చదవండి..: Nizamabad Power Supply | మెరుగైన విద్యుత్తు సరఫరాకు కృషి : ట్రాన్స్‌కో గ్రిడ్ అండ్ ట్రాన్స్మిషన్ డైరెక్టర్ సంపత్ రావు
