అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Municipal Controversy | సమస్యల పట్ల స్పందించకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి,(Municipal Commissioner Rajender Reddy) టీపీవో గిరిధర్‌ను సరెండర్ చేయాలని కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. శనివారం కామారెడ్డి మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
Kamareddy Municipal Controversy | ఛైర్మన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన..
బల్దియా ఛైర్మన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్, ఆర్డీఓ గిరి పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం నుంచే సమస్యలపై వాడీవేడిగా చర్చ సాగింది. పలువురు అధికారులపై కౌన్సిలర్లు ఫైర్ అయ్యారు. సమావేశం మొదటి నుంచి కమిషనర్ తీరుపై కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని ఆరోపించారు. దానికి కారణం కమిషనరేనని పేర్కొన్నారు.
Kamareddy Municipal Controversy | తన ఫోన్ సైతం లిఫ్ట్ చేయట్లేదని ఛైర్మన్ ఆవేదన..
ఈ సందర్భంగా ఛైర్మన్ స్పందిస్తూ.. తన ఫోన్ కూడా కమిషనర్ లిఫ్ట్ చేయరని, సమస్యలపై చర్చించేందుకు ఛాంబర్‌కు రావాలని సమాచారం ఇచ్చినా రావట్లేదని పేర్కొన్నారు. దీంతో ఛైర్మన్ పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని కౌన్సిలర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీపీవో గిరిధర్ (TPO Giridhar)సైతం పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం మధ్యలోనే టీపీవో వెళ్లిపోవడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీవో సెలవులో ఉన్నాడని అధికారులు సమాధానం ఇవ్వడంతో సెలవులో ఉంటే మీటింగుకు ఎందుకు వచ్చారని, బడ్జెట్ సమావేశం ఉందని తెలిసి కూడా సెలవుకు అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్, టీపీవో ఇద్దరిని సరెండర్ చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. తాను నోట్ చేసుకున్నానని అదనపు కలెక్టర్ చెప్పినా కౌన్సిలర్లు వినిపించుకోలేదు. సరెండర్ చేస్తున్నట్లు తీర్మానం చేయాల్సిందేనని కౌన్సిలర్లంతా మూకుమ్మడిగా పోడియం వద్దకు వెళ్లారు. తీర్మానం చేయాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో ఇద్దరిని సరెండర్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఇది కూడా చదవండి..: Kavitha Party Name Controversy | కవిత వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ప్రజాప్రతినిధుల ఆగ్రహం..

