అక్షరటుడే, హైదరాబాద్: Kavitha Arrest Narsingi | తెలంగాణ జాగృతి Telangana Jagruthi అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ఆందోళనకు దిగారు. మంగళవారం స్థానికులతో కలిసి ధర్నా చేపట్టారు. హైడ్రా బుల్డోజర్లు వచ్చే వరకు నిరసన విరమించేది లేదని బైఠాయించారు. దీంతో తదుపరి చర్యగా కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు పలువురు జాగృతి నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు.
Kavitha Arrest Narsingi | పోలీసుల తీరుపై ఆగ్రహం
ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. మూసీ మధ్యలో పెద్దలు కడుతున్న భవనాలను వదిలి, పేదల గూళ్లు కూలగొడుతున్నారని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అప్పటి భారాస సర్కారు ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని, కాంగ్రెస్ దానికి రాచబాట వేసిందని విమర్శించారు.
Kavitha Arrest Narsingi | నిరంతరం పోరాటం
మూసీ రివర్ బెడ్‌లో నిర్మాణాలపై చర్యలు తీసుకోని సర్కారు.. వెలుగుమట్లలో మాత్రం పేదల గుడిసెలను కూల్చేయడం ఏమిటని ఘాటుగా విమర్శించారు. హైడ్రా బుల్డోజర్లు వచ్చి, చర్యలు తీసుకుంటేనే.. పేదల పక్షాన రాష్ట్ర సర్కారు ఉందని భావిస్తామన్నారు. సాధారణ నిర్మాణాలకు మూసీ నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన విధించిన సర్కారు.. పెద్దలకు మాత్రం 5 మీటర్ల దూరంలోనే అనుమతులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అక్రమ నిర్మాణాలపై జాగృతి నిరంతరం పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

