అక్షరటుడే, హైదరాబాద్: Kavitha Hunger Strike | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు తన తల్లి బాటలో నడుస్తున్నారు. ఆమెతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కేసీఆర్ కుటుంబానికి కవిత దూరం అయ్యారు. ఈ క్రమంలో ఒంటరి పోరాటం చేస్తున్న తన తల్లికి పెద్ద కుమారుడు ఆదిత్య తోడుగా ఉంటున్నారు. వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. చదువుకోవాల్సిన వయసులో తల్లితో పాటు రాజకీయాల్లో తిరుగుతున్నాడు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇటీవల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొన్నారు. అంతేగాకుండా కవిత జన్మదిన వేడుకల సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో సైతం ఆయన పాల్గొన్నారు. కాగా ఆదిత్య రాజకీయాలపై ఫోకస్ పెట్టడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చదువుకునే వయసులోనే రాజకీయాలపై దృష్టి పెట్టారంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా సమస్యలపై తల్లి చేస్తున్న పోరాటానికి అండగా నిలుస్తున్నందుకు మరికొందరు అభినందిస్తున్నారు.
Kavitha Hunger Strike | రాజకీయాల్లోకి వస్తారా..
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక కల్వకుంట్ల కవిత జాగృతి బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కొత్త పార్టీ ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్నారు. మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఆమె తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌తో దూరంగా ఉంటున్నారు. తల్లిని మాత్రం పలుమార్లు కలిశారు. ఒంటరిగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై కవిత పోరాటం చేస్తున్నారు. అన్ని పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తన పెద్ద కుమారుడు అండగా నిలుస్తున్నారు. దీంతో కవిత పార్టీ పెట్టాక ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

