అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kerala BJP Prospects | దక్షిణాదిలో బలం పెంచుకోవాలని బీజేపీ కొన్ని ఏళ్లుగా ప్రణాళికలు రచిస్తోంది. కర్నాటక (Karnataka)లో ఆ పార్టీ ప్రతిపక్షంగా కొనసాగుతుండగా.. తెలంగాణ (Telangana)లోనూ బలంగానే ఉంది. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. అయితే తమిళనాడు, కేరళలో పార్టీని విస్తరించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ మేరకు తాజాగా జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తోంది.
కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి. ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 140 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఎల్డీఎఫ్ కూటమి అధికారంలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షంగా కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఎల్డీఎఫ్ 95 స్థానాల్లో గెలుపొందగా.. యూడీఎఫ్ 42 చోట్ల గెలుపొందింది. బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అయితే 11శాతానికి పైగా ఓట్లను సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.
Kerala BJP Prospects | అభ్యర్థుల ప్రకటన
కేరళలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇటీవల బీజేపీ (BJP) ప్రకటించింది. తొలి జాబితాలో 47 మందికి టికెట్లు కేటాయించగా.. 39 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో మాజీ కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రాజీవ్ చంద్రశేఖర్, వి. మురళీధరన్, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌తో సహా పలువురు కీలక నాయకులకు చోటు దక్కింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ కుమార్తె పద్మజా వేణుగోపాల్, పి.కె. కృష్ణదాస్, మాజీ డీజీపీ ఆర్. శ్రీలేఖ, సినీ దర్శకుడు మేజర్ రవి బీజేపీ నుంచి బరిలో నిలిచారు.
Kerala BJP Prospects | ఒక్క చోట మాత్రమే..
కేరళలో ఇప్పటివరకు బీజేపీ విజయం ఒక్కచోట మాత్రమే గెలుపొందింది. 2016 ఎన్నికల్లో నెమోమ్ నుంచి కమలం అభ్యర్థి ఓ రాజగోపాల్ విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని బీజేపీ యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర నాయకత్వం ప్రణాళికలు రచిస్తుండగా.. క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కీలకమైన తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. అదే ఊపులో అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని చూస్తోంది.
ఇది కూడా చదవండి..: Power Petrol Price Hike | పెరిగిన పవర్ పెట్రోల్ ధరలు

