అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kospi Market Crash | అమెరికా, ఇజ్రాయిల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఇరాన్‌లో యుద్ధం నాలుగో రోజుకు చేరింది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి.
యూఎస్ దాడులకు ప్రతిగా ఇరాన్.. రియాద్ Riyadh లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేయడం ద్వారా ప్రతీకార చర్యను తీవ్రతరం చేసింది. మరోవైపు ప్రపంచ సరుకు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడంతో.. దీని ప్రభావం అన్ని దేశాలపైనా కనిపిస్తోంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ సరఫరా చైన్‌కు అంతరాయం కలగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు కకావికలమవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
Kospi Market Crash | 8 శాతం నష్టంతో కోస్పీ..
దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ దారుణమైన పతనాన్ని చవిచూసింది. బుధవారం ఇంట్రాడేలో 8 శాతానికిపైగా నష్టపోయింది. ఇది ఆ దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2024 ఆగస్టు తర్వాత అతిపెద్ద పతనం. చిప్‌మేకర్లు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో. మరియు ఎస్‌కే హైనిక్స్ ఇంక్ కనీసం 9.9 శాతం క్షీణించాయి. సోమవారం పాకిస్తాన్‌కు చెందిన కేఎస్ఈ ఇండెక్స్ సుమారు 10 శాతం పతనమై ఇంట్రాడేలో సుమారు 45 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇతర దేశాల మార్కెట్లు సైతం భారీగా నష్టపోతున్నాయి.

