అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bulldozer Rajyam | రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం అని విమర్శించారు.
మూసీ ప్రాజెక్టు (Musi project)లో భాగంగా ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కేటీఆర్ ఆదివారం కలివారు. వారు నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
Bulldozer Rajyam | అండగా ఉంటాం
మూసీ బాధితులు తమ భూములను, ఇళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ పోరాటంలో బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి రూ.200 కోట్లతో నివాసం నిర్మించుకుంటున్నారని చెప్పారు. ఆయనకు వందల కోట్ల ఇళ్లు కావాలి కానీ పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ కూడా ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసమని ప్రశ్నించారు.
Bulldozer Rajyam | కాంట్రాక్టుల కోసమే..
రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, తన అనుచరులకు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఇందుకోసం పేదల ఇళ్లను పణంగా పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.16 వేల కోట్లతో ఒక్క ఇల్లు పోకుండా.. మూసీ సుందరీకరణకు డీపీఆర్ (DPR) సిద్ధం చేశామని చెప్పారు. దానిని పక్కన పెట్టి రేవంత్‌రెడ్డి రూ.1.50 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీలో ఇళ్లు ఉన్నాయని ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫార్మ్‌హౌస్‌లు, విల్లాలు, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.


