అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లను శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో సన్మానించారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు తదితరులు పాల్గొన్నారు.
KTR Slams Congress | బీఆర్ఎస్‌కు మద్దతు
ఆలంపూర్, ఐజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు అందించిన మద్దతు విశేషమని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్ఎస్‌పైనే ఉందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందన్నారు.
KTR Slams Congress | ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. నాగర్‌కర్నూల్‌లో రెండు నెలల పాప మరణం, కోదాడలో దళిత యువకుడు రాజేష్ లాకప్ డెత్ వంటి ఘటనలు కాంగ్రెస్ అరాచకాలకు నిదర్శనమన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలను కేటీఆర్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా సాగితే.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనతో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెక్ డ్యామ్‌లు పేల్చడం, పల్లె ప్రకృతి వనాల్లో చెట్ల నరకడం చేస్తున్నారని ఆరోపించారు.

KTR Slams Congress | హామీల అమలు ఎక్కడ
ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. రైతు బంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలని కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Ponguleti vs KTR | కేటీఆర్, హరీశ్‌రావుపై పొంగులేటి ఆగ్రహం

