అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kukatpally ACB Trap | కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేశారు. రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా మూసాపేట్ కమ్యూనిటీ ఆర్గనైజర్ మురళిని పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి జోన్ మూసాపేట్ సర్కిల్-53లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా కె. మురళి పని చేస్తున్నారు. ఒక మహిళా సంఘానికి మంజూరైన రూ.20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ.18,000/- లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి మురళి లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Kukatpally ACB Trap | మారని తీరు
అవినీతి అధికారులు మారడం లేదు. లంచాలు తీసుకోవడం కూడా ఒక విధిగా భావిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా తహశీల్దార్, రిజిస్ట్రేషన్, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యం ఏలుతోంది. ఏసీబీ అధికారులు ఇటీవల దాడులు చేపడుతున్నా.. అవినీతికి మరిగిన అధికారులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. ఏసీబీకి దొరికినా కఠిన చర్యలు లేకపోవడంతో.. లంచాలు తీసుకోవడానికి భయపడటం లేదు.
Kukatpally ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వస్తువులు, బహుమతుల రూపంలో అడిగినా.. తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ వెబ్సైట్ (ACB Website) ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
దీనిని కూడా చదవండి : ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు

