అక్షరటుడే, వెబ్‌డెస్క్ : LPG Booking Interval | గ్యాస్ సిలిండర్ల (Gas Cylinders) బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య వ్యవధిని 25 రోజులకు పెంచినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొసాగుతన్నాయి. దీంతో ఆయిల్ (Crude Oil)తో పాటు గ్యాస్ రవాణాపై తీవ్రంగా పడింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్యాస్ సిలిండర్ల మధ్య బుకింగ్ వ్యవధిని 15 రోజుల నుంచి 21 రోజులకు పెంచింది. తాజాగా ఆ గడువును 25 రోజులకు పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 9న దేశీయ LPG సిలిండర్ల బుకింగ్ కోసం కనీస నిరీక్షణ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు.
LPG Booking Interval | అసాధారణ బుకింగ్‌తో..
వినియోగదారులలో అసాధారణ బుకింగ్ విధానాలను అధికారులు గమనించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రతి 55 రోజులకు ఒకసారి సిలిండర్లను బుక్ చేసుకున్న కుటుంబాలు ప్రస్తుతం 15 రోజుల్లోనే ఆర్డర్లు ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో నిల్వలు, మళ్లింపు సాధ్యమవుతుందనే ఆందోళనలు తలెత్తాయి. సవరించిన బుకింగ్ విరామం న్యాయమైన పంపిణీని నిర్ధారించడం, మార్కెట్లో కృత్రిమ కొరతను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
LPG Booking Interval | ఉత్పత్తి పెంచాలని ఆదేశం
పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి LPG ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం దేశవ్యాప్తంగా శుద్ధి కర్మాగారాలను ఆదేశించింది. గృహాలు కొరతను ఎదుర్కోకుండా చూసుకోవడానికి వాణిజ్య LPG కనెక్షన్ల కంటే డోమెస్టిక్ వినియోగానికి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు తెలిపారు. సరఫరాను మెరుగు పరచడానికి ప్రభుత్వం అదనపు దిగుమతి ఎంపికలను కూడా అన్వేషిస్తోందని అధికారులు వెల్లడించారు.

LPG Booking Interval | బ్లాక్ మార్కెట్‌కు..
దేశవ్యాప్తంగా డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇటీవల పెరిగిన విషయం తెలిసిందే. అయితే డొమెస్టిక్ సిలిండర్ల (Domestic cylinders)ను పలువురు వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. కొందరు వీటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండు సిలిండర్ల మధ్య బుకింగ్ వ్యవధిని 25 రోజులకు పెంచింది.
దీనిని కూడా చదవండి : India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ

