అక్షరటుడే, వెబ్‌డెస్క్: LPG Shortage Impact | దేశంలో వంటగ్యాస్ (LPG) కొరత కొత్త సమస్యలకు దారితీయవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు గృహ, హోటల్ రంగంపైనే ప్రభావం పడుతున్న ఈ పరిస్థితి, తాజాగా టెలికాం రంగంపైనా పడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ విస్తరణపై దీని ప్రభావం కనిపించే అవకాశముందని చెబుతున్నారు.
LPG Shortage Impact | టవర్ల తయారీపై ప్రభావం
మొబైల్ నెట్‌వర్క్ సేవలను అందించేందుకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో టెలికాం టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ టవర్ల ఏర్పాటు ప్రక్రియలో గాల్వనైజేషన్ అనే దశ చాలా కీలకం. ఇందులో ఇనుప భాగాలపై జింక్ పొరను పూస్తారు. అవి తుప్పు పట్టకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. ఈ గాల్వనైజేషన్ ప్రక్రియ చేపట్టేందుకు అధిక ఉష్ణోగ్రతలు అవసరం. ఇందు కోసం LPG / LNG వంటి ఇంధనాలను ఉపయోగిస్తారు.
కానీ, తాజాగా గ్యాస్ సరఫరాలో అంతరాయం వల్ల టెలికాం టవర్ తయారీ సంస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సరిపడా LPG అందుబాటులో లేకపోతే గాల్వనైజేషన్ ప్రక్రియను నిరంతరం కొనసాగించడం ఇబ్బందిగా మారుతుందని సంస్థలు వాపోతున్నాయి.
LPG Shortage Impact | నెట్‌వర్క్ విస్తరణలో సమస్యలు..
టవర్ తయారీ యూనిట్లు తగ్గించాల్సి వస్తే కొత్త టవర్ల ఏర్పాటు ఆలస్యం అవుతుంది. ఈ ప్రభావం మొబైల్ నెట్‌వర్క్ విస్తరణపై పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు కొత్తగా అభివృద్ధి చెందుతున్నప్రాంతాల్లో నెట్‌వర్క్ కనెక్టివిటీ మెరుగుపర్చే పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందనేది వాదన.
డేటా వినియోగం ఇప్పటికే భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టెలికాం మౌలిక వసతులు నిరంతరంగా విస్తరించడం అవసరం ఉంది. కానీ, గ్యాస్ కొరత వల్ల టవర్ తయారీ మందగిస్తే ఫ్యూచర్లో మొబైల్ సిగ్నల్ నాణ్యత, ఇంటర్నెట్ వేగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని అంటున్నారు.
పరిశ్రమ వర్గాల ఆందోళన
గ్యాస్ సరఫరాలో ప్రభుత్వ జోక్యం అవసరమని టెలికాం టవర్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. గాల్వనైజేషన్ ప్రక్రియకు నిరంతర LPG సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నాయి. లేదంటే.. టెలికాం మౌలిక సదుపాయాల అభివృద్ధి నెమ్మదిస్తుందని.. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వాపోతున్నాయి.

