అక్షరటుడే, వెబ్‌డెస్క్: Markapur Bus Accident Hero | మార్కాపురం జిల్లాలో జరిగిన దారుణ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనమవగా, 25 మందికిపైగా తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో చోటుచేసుకున్న విషాదంతో పాటు, ఓ వ్యక్తి ప్రదర్శించిన ధైర్యసాహసం అందరి ప్రశంసలు అందుకుంటోంది.
హనుమంతునిపాడు మండలం తక్కెళ్లపాడు (Takkellapadu)కు చెందిన బాలరాజు అదే బస్సులో ప్రయాణిస్తున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మంటలు చెలరేగుతుండగా, సమయస్ఫూర్తితో స్పందించిన ఆయన బస్సు అద్దాలను రాడ్‌తో పగలగొట్టి 8మంది ప్రయాణికులను బయటకు దించారు. అనంతరం తాను కూడా దూకి ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. మరో మహిళను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె సీట్ల కింద ఇరుక్కుపోవడంతో కాపాడలేకపోయినట్లు బాలరాజు తెలిపాడు.
Markapur Bus Accident Hero | రియల్ హీరో బాలరాజు..
ప్రస్తుతం గాయాలతో ఆయన మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రి (Markapuram Government Hospital)లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం వేకువజామున సుమారు 5.40 గంటల సమయంలో రాయవరం సమీపంలో చోటుచేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ (Harikrishna Travels)కి చెందిన బస్సు తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా (Nellore District) కలిగిరికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడంతో బస్సు అగ్నికి ఆహుతైంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఐదు నెలల చిన్నారి కూడా ఉన్నారు. డ్రైవర్ సహా 25 మందికిపైగా గాయపడగా, వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.
Markapur Bus Accident Hero | ట్యాంక్ పగిలి డీజిల్ బస్సుపై చిందడంతో మంటలు
ప్రాథమిక సమాచారం ప్రకారం, టిప్పర్ వాహనంలోని ఆయిల్ ట్యాంక్‌ను కాసేపటి ముందే డీజిల్‌తో నింపినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్యాంక్ పగిలి డీజిల్ బస్సుపై చిందడంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో రెండు వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.మంటల్లో కాలిపోయిన మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతినడంతో, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తింపు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఎక్కువమంది నెల్లూరు జిల్లా ఉదయగిరి, మార్కాపురం ప్రాంతాలకు చెందినవారు. వీరంతా కామారెడ్డి, జగిత్యాల ప్రాంతాల్లో బేల్దారి పనులు చేసి, శ్రీరామనవమి సందర్భంగా సొంత ఊర్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో అనేక కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. అయితే, ప్రాణాలకు తెగించి 8మందిని కాపాడిన బాలరాజు ధైర్యం అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి : Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..

