అక్షరటుడే, వెబ్‌డెస్క్: Menaka Guruswamy Rajya Sabha | రాజ్యసభ ఎన్నికలకు తమ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తుంటాయి. ఇందులో పశ్చిమ బెంగాల్‌నుంచి అభ్యర్థిత్వం దక్కించుకున్న సీనియర్ లాయర్ మేనకా గురుస్వామిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమబెంగాల్ (West Bengal)లో అయిదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో నాలుగింటిని తృణమూల్ కాంగ్రెస్ తిరిగి గెలుచుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాలుగు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్‌కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్ ఉన్నారు. కాగా ఇందులో అందరి దృష్టి మేనకా గురుస్వామిపై కేంద్రీకృతమై ఉంది. సుప్రీంకోర్టు (Supreme Court) సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి రాజ్యసభకు ఎంపికైతే సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే మేనకా గురుస్వామి ఎల్‌జీబీటీక్యూ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ వంటి వర్గాలను తెలియజేసే పదం). ఆమె ఎగువ సభకు ఎన్నికైతే భారత పార్లమెంట్ చరిత్రలోనే తొలి ఎల్‌జీబీటీక్యూ అవుతారు.
Menaka Guruswamy Rajya Sabha | తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా..
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి (Menaka Guruswamy Rajya Sabha) జీవితం న్యాయపరమైన ప్రతిభ, సామాజిక న్యాయం కోసం పోరాటం, అంతర్జాతీయ గుర్తింపులతో నిండి ఉంది. ఆమె 1997లో భారత మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో తన కెరీర్‌ను ప్రారంభించారు. 2001లో ఆక్స్‌ఫర్డ్‌లో తన బీసీఎల్, హార్వర్డ్‌లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. కొంతకాలం న్యూయార్క్‌లోని డేవిస్ పోల్క్, వార్డ్‌వెల్‌లో అసోసియేట్‌గా పనిచేశారు.
టీఎంసీ తరఫున వాదనలు
అనంతరం భారత్ తిరిగి వచ్చి న్యూఢిల్లీలో స్థిరపడ్డారు. 2018లో చరిత్రాత్మక తీర్పు వెలువరించడానికి కారణమయ్యారు. ఎల్‌జీబీటీక్యూ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో ఆమె ఒకరు. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్‌జీబీటీక్యూ ఎంపీగా రికార్డుల్లోకి ఎక్కుతారు. బెంగాల్‌లో ఇటీవల ఐ ప్యాక్ కార్యాలయాలలో ఈడీ సోదాలను సుప్రీం కోర్ట్‌లో సవాలు చేసిన టీఎంసీ తరఫున మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. ఈ కారణంగానే ఆమెకు రాజ్యసభ టికెట్లు ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి..: Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

