అక్షరటుడే, వెబ్డెస్క్: Middle East Oil Crisis | మధ్యప్రాచ్యంలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుద్ధం తీవ్రం కావడంతో చమురు ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశంలో ప్రస్తుతం 25 రోజుల వరకు క్రూడ్ ఆయిల్, శుద్ధి చేసిన ఇంధనాల నిల్వలు ఉన్నాయని పేర్కొంది. భౌగోళిక-రాజకీయ కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం పెంచే యోచన లేదని స్పష్టం చేసింది.
Middle East Oil Crisis | పెరుగుతున్న బ్రెంట్ క్రూడ్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 80 డాలర్ల సమీపంలోకి చేరింది. ఇరాన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి దాదాపు 10 శాతం పెరిగింది. అలాగే ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఆయిల్ రవాణా మార్గమైప హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం ఆయిల్ దిగుమతిపై ఆధారపడిన భారత్ వంటి దేశాలపై పడనుంది. దిగుమతి ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Middle East Oil Crisis | మధ్యప్రాచ్య దేశాల నుంచి..
భారత్ తనకు అవసరమైన క్రూడ్ ఆయిల్‌లో 88 శాతం వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 50 శాతానికి పైగా మధ్యప్రాచ్య దేశాల నుంచి వస్తోంది. ఈ సరఫరా హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా జరుగుతుంది. కాగా.. ఇరాన్ సంక్షోభం వల్ల ఈ మార్గంలో అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడనుంది. దీంతో ఆయిల్ సరఫరా భద్రతపై కొంత వరకు ఆందోళన నెలకొంది.
Middle East Oil Crisis | ప్రపంచం మూడో అతిపెద్ద దిగుమతిదారు
ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుగా భారతదేశం ఉంది. తన క్రూడ్ అవసరాల్లో సగం వరకు హార్ముజ్ జలసంధి మీదుగా దిగుమతి చేసుకుంటోంది. అయితే దేశానికి ప్రధాన ఎల్ఎన్జీ సరఫరాదారు ఖతార్ కూడా ఈ మార్గాన్నే వినియోగిస్తుంది. దీంతో ఇంధన రవాణా ప్రభావం పడనుంది.
Middle East Oil Crisis | భారత్ ప్రత్యామ్నాయ వ్యూహాలు
హార్ముజ్ స్ట్రెయిట్ మూసివేతతో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుని లోటును పూడ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే రష్యా నుంచి కూడా అదనపు ఆయిల్ దిగుమతి చేసుకుని ఇంధన కొరతను అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి..: Strait of Hormuz Closure | హార్ముజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన 700కి పైగా నౌకలు

