అక్షరటుడే, నేషనల్ డెస్క్: Minuteman III Missile | మధ్యప్రాచ్యంలో తీవ్రమైన యుద్ధం కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం జరిగింది. శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిని యూఎస్ఏ పరీక్షించింది. మార్చి 3న పరీక్ష చేపట్టగా.. ఇందుకు సంబంధించిన వివరాలు బయటికొచ్చాయి.
Minuteman III Missile | మినిట్‌మ్యాన్-3 పరీక్ష
కాలిఫోర్నియా (California) తీరంలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మినిట్‌మ్యాన్-3ను అమెరికా ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ పరీక్షలు చేసింది. మంగళవారం రాత్రి 11 గంటలకు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా.. ఆయుధాలు లేని ఈ ఖండాంతర క్షిపణి మార్షల్ ఐల్యాండ్స్ (Marshall Islands)లో లక్ష్యాన్ని ఛేదించినట్లు స్పేస్‌ఫోర్స్ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతమైందని, కచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని వెల్లడించింది. కాగా.. ఇరాన్ (Iran)పై దాడులు చేస్తున్న సమయంలో ఈ పరీక్షలు నిర్వహించడం గమనార్హం.

Minuteman III Missile | మార్క్-21 రీఎంట్రీ వెహికల్
మినిట్‌మ్యాన్-3లో శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది. ఇందులో న్యూక్లియర్ పేలోడ్ (Nuclear Payload)ను అమర్చే అవకాశం ఉంటుంది. జపాన్‌లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే ఇది 20 రెట్లు పెద్దవైన అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. అయితే దీని శక్తి సామర్థ్యాలను అమెరికా గతంలోనూ పలుమార్లు పరీక్షించింది. కాగా.. క్షిపణి గంటకు 15వేల మైళ్ల వేగంతో 6వేల మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదని సమాచారం.
ఇది కూడా చదవండి..: Iran Warship Sinking | నీటమునిగిన ఇరాన్ యుద్ధనౌక.. శ్రీలంక తీరంలో ఘటన.. 100 మంది గల్లంతు..!

