అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mohammed Abdul Malik | కష్టాల్ని కట్టడి చేసి జ్ఞానాన్ని ఆయుధంగా మలచుకున్న వ్యక్తిత్వమే Professor Mohammed Abdul Malik. చిన్ననాడు పశువుల కాపరిగా.. వ్యవసాయ కూలీగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, అక్షరాల కోసం చేసిన పోరాటం, సామాజిక చైతన్యంతో నిండిన ఉద్యమ జీవితం… వెరసి ఒక సాధారణ మనిషిని ప్రఖ్యాత ఆచార్యుడిగా.. సమాజ మార్పు కోసం కృషి చేసే మేధావిగా తీర్చిదిద్దాయి.
సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు ఫూలె జయంతిని పురస్కరించుకుని, నిజామాబాద్ జిల్లా సిరికొండలోని సత్యశోధక్ పాఠశాల రజతోత్సవ వేడుకల్లో ఫ్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్‌ను సన్మానించుకుంటున్న శుభ తరుణంలో అక్షరటుడే ప్రత్యేక కథనం..

ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో 1973 జూన్ 10న కీ.శే. బాలయ్య, కిష్టవ్వ దంపతులకు జన్మించారు. ఐదుగురు తోబుట్టువులలో చిన్నవారైన ఆయన జీవితం చిన్ననాటి నుంచే కఠినమైన సవాళ్లను ఎదుర్కొంది. పదో తరగతి పూర్తి కాకముందే తల్లిదండ్రులను కోల్పోవడం ఆయన జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేసినా.. ఆ దుర్భర పరిస్థితులనే తన సంకల్పబలంగా మార్చుకొని ముందుకు సాగారు.
ఆరో తరగతిలో ఆగిపోయిన చదువు ప్రజా ఉద్యమం వైపు తీసుకెళ్లింది. విద్యార్థి దశలోనే సామాజిక చైతన్యం పొంది, పీడీఎస్‌యూ, బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించి.. ప్రజా, విద్యార్థి సమస్యలపై గళం విప్పి, పరిష్కారానికి కృషి చేశారు.
ఆ ఉద్యమ స్ఫూర్తిని సంకల్పంగా మార్చుకుని చదువు వైపు దృష్టి సారించారు. చేను పనుల మధ్యలో పుస్తకాలపై మక్కువ పెంచుకున్నారు. బాధ్యతల నడుమ భవిష్యత్తు నిర్మించుకున్నారు. పదో తరగతి పూర్తి చేసుకుని ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు.
నిజామాబాద్ (Nizamabad) ఖిల్లా జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ (1992–94) పూర్తి చేసి, కళాశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన మాలిక్.. గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ (బీ.ఏ.1994–97) చేసి, కళాశాల Topper గా స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. విద్యార్థి దశలో పలు వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో సాధించిన విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.
Mohammed Abdul Malik | ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు
తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో M.A. ఎకనామిక్స్ ప్రవేశ పరీక్షలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించిన ఆయన ప్రథమ స్థానంలో మాస్టర్స్ (1997-99) పూర్తి చేశారు. అనంతరం LL.B ప్రవేశ పరీక్షలో 19 వ ర్యాంక్ సాధించి, డిస్టింక్షన్ తో (1999-2002) పట్టా తీసుకున్నారు. ఎం.ఫిల్ ప్రవేశ పరీక్షలో ప్రథమ ర్యాంకు సాధించినప్పటికీ, ఆ కోర్సులో చేరకుండా Ph.D వైపు దృష్టి సారించారు. “భారతదేశ ఆర్థిక సంస్కరణలు మరియు సామాజిక రంగంపై దాని ప్రభావం” అనే అంశంపై (2002–08) పరిశోధన గ్రంథం సమర్పించడం ద్వారా డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
Mohammed Abdul Malik | అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్
మాలిక్ 2002లో జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం 2005–2007 మధ్య అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా సేవలందించిన ఆయన.. తిరిగి విద్యా రంగంలో ప్రవేశించి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా (2010), అసోసియేట్ ప్రొఫెసర్‌గా (2022), ప్రొఫెసర్‌గా (06.11.2025) పదోన్నతులు పొందారు.
దోమ, శంషాబాద్ (బేగంపేట్ డివిజన్ – ACTO), గజ్వేల్, కూకట్‌పల్లి వంటి ప్రదేశాలలో విధులు నిర్వర్తించిన మాలిక్.. ప్రస్తుతం చేవెళ్లలో విద్యా సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తుగా 2015లోనే తెలంగాణ కళాశాల విద్యాశాఖ రాష్ట్ర ఉత్తమ అర్థశాస్త్ర అధ్యాపక పురస్కారంతో సత్కరించింది.

తెలంగాణ ఉద్యమంలోనూ ఆచార్య మాలిక్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ ఉపాధ్యక్షుడిగా, తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక ( TMIF) అధ్యక్షులుగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రాంతం అంతటా తిరిగి మేధావులకు, సాధారణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు.
సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీకి వ్యవస్థాపక సలహాదారుగా, ఫూలే – అంబేడ్కర్ ఆలోచన సమితి (PAAS) స్థాపకునిగా, బహుజన విద్యావంతుల వేదిక సమన్వయ కర్తగా ఫూలే – అంబేడ్కర్ – మాన్యవర్ కాన్షీరామ్ కలల సాకారం కోసం ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. వడ్డీ రహిత ఆర్థిక సహాయం అందించే సంస్థలను స్థాపించడంతోపాటు అలాంటి ఆర్థిక కార్యక్రమాలకు అండగా ఉండి ప్రోత్సహిస్తున్నారు.
జ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకున్న ఆచార్య మాలిక్.. సమాజ సేవనే తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారు. అలా అర్థశాస్త్రం కోసం కలం పట్టి ఆలోచనలకు రూపం ఇచ్చి వాగ్గేయకారుడయ్యారు.. ఇప్పటి వరకు 27 గ్రంథాలు, 36 వ్యాసాలు రచించారు.. గత 24 సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి పత్రికలో అర్థశాస్త్రం పైన పోటీ పరీక్షల కోసం వ్యాసాలు రాస్తున్నారు. దీనికితోడు ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో అర్థశాస్త్రం బోధించడం ద్వారా వేలాది జీవితాలకు వెలుగు చూపారు.
హిందూ సామాజిక జీవన ప్రస్థానంలో తాను ఎదుర్కొన్న, చూసిన వివక్షతకు అంతం పలికే లక్ష్యంతో పెరియార్ – ఫూలే – అంబేడ్కర్లను అధ్యయనం చేసి ఇస్లాం జీవన విధానాన్ని స్వీకరించారు. అనంతరం 2002లో డాక్టర్ సయ్యిదా మరియం గజాలాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు నాయిలా కౌసర్, హమ్మాద్ మలిక్, జవ్వాద్ మలిక్ అనే ముగ్గురు ముద్దు బిడ్డలకు జన్మనిచ్చి, వారిని కూడా తమ బాటలోనే ఉన్నత విద్యాభ్యాసం చేయిస్తున్నారు.
జీవితాన్ని జయించేది పరిస్థితులు కాదు, పట్టుదల అని తన జీవన ప్రయాణంతోనే చాటిచెప్పిన వ్యక్తి Professor Mohammed Abdul Malik. చీకట్ల మధ్య వెలుగై నిలిచిన ఆయన కథ, కష్టాలు ఎదురైన ప్రతి మనిషికి దిశానిర్దేశం చేసే దీపస్తంభం లాంటిది. అక్షరాలను ఆయుధంగా, ఆలోచనలను మార్గంగా, సమాజ సేవను లక్ష్యంగా చేసుకున్న ఆయన అడుగుజాడల్లో నడిస్తే—మార్పు సుసాధ్యమే.
ఇది కూడా చదవండి..: BC Women Reservation | బీసీల కోసం జాగృతి పోరాటం : కల్వకుంట్ల కవిత
