అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mojtaba Khamenei | ఇరాన్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం ఆయన కుమారుడు అయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ దేశ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.
Mojtaba Khamenei | సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ
ఆదివారం జరిగిన సమావేశంలో అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (Assembly of Experts) మొజ్తాబాను ఇరాన్ మూడవ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నట్లు తెలిపింది. ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాల్లో సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ మాటే తుది నిర్ణయంగా ఉండనుంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో సుప్రీం లీడర్ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశ విదేశాంగ విధానం, రక్షణ, కీలక వ్యూహాత్మక నిర్ణయాలపై ఈ పదవికి విస్తృత అధికారాలు ఉంటాయి.
Mojtaba Khamenei | అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరికలు
ఇరాన్‌లో ఈ మార్పుల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. కొత్త సుప్రీం లీడర్ అమెరికా అనుమతిని గౌరవించాలని, లేకపోతే ఎక్కువకాలం ఆ పదవిలో కొనసాగలేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ (Defense Minister Israel Kaz) మాట్లాడుతూ, ఇరాన్‌లో కొత్త సుప్రీం లీడర్ ఎవరు అయినా తమ తదుపరి లక్ష్యమవుతారని స్పష్టం చేశారు. అతను ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టమని కూడా హెచ్చరించారు. గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం వెలువడింది. ఆ దాడుల్లో ఆయనతో పాటు భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి.

Mojtaba Khamenei | ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌తో బలమైన సంబంధాలు
ఆ తరువాత తాత్కాలికంగా ఇరాన్ పాలనను తాత్కాలిక సుప్రీం లీడర్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మొజ్తాబా ఖమేనీ అధికారికంగా సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. దివంగత అలీ ఖమేనీకి మొజ్తాబా రెండవ కుమారుడు. తండ్రి సుప్రీం లీడర్‌గా ఉన్న సమయంలోనే మొజ్తాబా ఖమేనీకి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (Iran Revolutionary Guards)తో బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అధికారికంగా ప్రభుత్వ పదవి లేకపోయినా కీలక నిర్ణయాల్లో ఆయన ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణలు గతంలో వినిపించాయి. ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థపై కూడా ఆయనకు ప్రభావం ఉందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2019లో అమెరికా ట్రెజరీ విభాగం మొజ్తాబా ఖమేనీపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు ఆయన ఇరాన్ అత్యున్నత పదవిని చేపట్టడంతో ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు భవిష్యత్తులో కీలక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!

