అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mojtaba Khamenei Reward | ఇరాన్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం (America Government) భారీ బహుమతిని ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా విదేశాంగ శాఖ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Iran’s Supreme Leader Mojtaba Khamenei) ఆచూకీ తెలిపే వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.92 కోట్లకు పైగా) నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. సమాచారం ఇచ్చే వారు తమ వివరాలను గోప్యంగా ఉంచుకునేలా ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ లేదా టోర్ నెట్‌వర్క్ ద్వారా సమాచారం అందించవచ్చని పేర్కొంది.
Mojtaba Khamenei Reward | మరికొందరి పేర్లూ జాబితాలో
మొజ్తాబా ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతా వ్యవస్థకు చెందిన అలీ లారిజాని తదితరుల పేర్లను కూడా అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించింది. వీరికి సంబంధించిన కీలక సమాచారం అందించిన వారికి నగదు బహుమతితో పాటు అవసరమైతే పునరావాస సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపింది. మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మీడియా సంస్థలు ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెబుతుండగా, మరికొందరు ఆయన కోమాలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.
Mojtaba Khamenei Reward | అనేక అనుమానాలు
ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతి చెందినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆచూకీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా మొజ్తాబా ఖమేనీ కూడా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కూడా ఇరాన్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు.ప్రస్తుతం మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై కొనసాగుతున్న అనుమానాలు, అమెరికా ప్రకటించిన భారీ బహుమతి నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.
ఇది కూడా చదవండి..: Israel Iran Warning | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్ వార్నింగ్..

