అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Musi Project Allegations | మూసీ ప్రాజెక్ట్ పేరిట భూములను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు.
మూసీ సుందరీకరణ అని నది పక్కన ఉన్న భూములను ప్రపంచ బ్యాంక్ (World Bank), రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని కవిత ఆరోపించారు. మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధం కాకముందే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు. మూసీ సుందరీకరణ మొదటి దశ కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం 2025 సెప్టెంబర్‌లో చెప్పిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల మాట్లాడుతూ.. రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్లు అవుతుందన్నారు. డీపీఆర్ లేకుండానే.. ఆరు నెలల్లో ఇంత ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.
Musi Project Allegations | ఇంట్లో నుంచి ఇస్తున్నారా..
గాంధీ విగ్రహం కోసం రూ.70 కోట్లు అవుతుందని సీఎం చులకనగా చెబుతున్నారని, ఆ డబ్బులు రేవంత్‌రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని కవిత ప్రశ్నించారు. నిర్వాసితులను పక్కన పెట్టి.. మూసీ పక్కన ఉన్న భూములను పంచుకునే కుట్ర జరుగుతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజెంటేషన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలిచారన్నారు. ఇళ్లు కోల్పోతున్న వారిని హౌస్ అరెస్ట్ చేశారని విమర్శించారు. బాధితులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.
Musi Project Allegations | వ్యర్థాలు కలవకుండా చూడాలి
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల మాట వినడం లేదని జాగృతి అధ్యక్షురాలు విమర్శించారు. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగు నీరు చేరుతుందన్నారు. వాటిని నదిలో కలవకుండా ఎలాంటి చర్యలు చేపడుతారని ప్రశ్నించారు. మురుగు నీరు కలిసినప్పుడు ఎన్ని కోట్లు పెట్టినా మూసీ ప్రక్షాళన జరగదన్నారు. మూసీ ఆక్రమణలకు గురికాకుండా, వ్యర్థాలు నదిలో కలవకుండా చూడాలని ఆమె కోరారు.
Musi Project Allegations | హైడ్రాపై ఆగ్రహం
హైడ్రా పేదల ఇళ్లు కూలుస్తోందని, పెద్దల జోలికి వెళ్లడం లేదని కవిత విమర్శించారు. హైడ్రాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిత్య రియల్టర్ భవనం వద్ద తాము ధర్నా చేశామన్నారు. నాలాను ఆక్రమించి దానిని నిర్మించారని ఆరోపించారు. హైడ్రా దానిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : Attapur Hydraa Demolition | అత్తాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

