అక్షరటుడే, వెబ్‌డెస్క్: Musi Project NGT Relief | మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT)లో ఊరట లభించింది. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ఎన్జీటీ కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం (State Government) మూసీ ప్రాజెక్ట్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా మూసీ సుందరీకరణ చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గతంలో పలుమార్లు ప్రకటించారు. అయితే మూసీ ప్రాజెక్ట్‌తో ఎంతో మంది ఇళ్లు కోల్పోతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి ఎన్జీటీని ఆశ్రయించారు.
Musi Project NGT Relief | తొలిగిన అడ్డంకి
మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు (CM Revanth Reddy)లతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని కార్తీక్ రెడ్డి పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ట్రిబ్యూనల్ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రాజెక్ట్‌కు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. పిటిషనర్ సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ఎన్జీటీ పేర్కొంది. అనుమానాలతో ప్రాజెక్ట్‌ను అడ్డుకోలేమని స్పష్టం చేసింది.
Musi Project NGT Relief | సీఎం విమర్శలు
ఎన్జీటీలో కార్తీక్‌రెడ్డి పిటిషన్ వేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ (Omkareshwara Temple) నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబితా ఇంద్రారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక్కడి ప్రజలు ఆమె కుటుంబానికి ఎంతో ఇచ్చారని, కానీ ఆమె కుమారుడు మూసీ సుందరీకరణకు అడ్డుకోవడానికి పిటిషన్ వేశారన్నారు. ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకోకపోతే ఆమె కుటుంబాన్ని ప్రజలు సామాజిక బహిష్కరణ చేస్తారన్నారు. తాజాగా ట్రిబ్యూనల్ ఆ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ప్రభుత్వం పనులు చేపట్టే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి : కేటీఆర్
