అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nallamala Forest Fire | ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మహానంది సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్చిచ్చు చెలరేగింది. ఆలయానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Nallamala Forest Fire | వేగంగా విస్తరిస్తున్న అగ్నికీలలు
ఎండల తీవ్రత నేపథ్యంలో అడవిలో గడ్డి, ఆకులు పూర్తిగా ఎండిపోయాయి. ప్రస్తుతం వీస్తున్న గాలుల ధాటికి మంటలు క్షణక్షణానికి విస్తరిస్తున్నాయి. అటవీ అంతర్భాగంలోకి వేగంగా దూసుకుపోతున్నాయి. ఆలయ వెనుక భాగంలో ఉన్న కొండ ప్రాంతం వైపు మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
Nallamala Forest Fire | వన్యప్రాణులకు పొంచి ఉన్న ప్రమాదం
దట్టమైన నల్లమల అడవి అనేక అరుదైన వన్యప్రాణులకు నిలయం. తాజా కార్చిచ్చు వల్ల పక్షులు, జంతువుల మనుగడ ప్రమాదంలో పడినట్లైంది. ముఖ్యంగా లోతైన లోయల నడుమ ఉన్న జీవరాశులు మంటల బారిన పడే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవిలోని అమూల్యమైన ఔషధ మొక్కలు, కలప ఈ అగ్ని ప్రమాదంలో బూడిదవుతున్నాయి.
రంగంలోకి అటవీ శాఖ:
సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత విస్తరించకుండా ‘ఫైర్ లైన్ల’ ద్వారా నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతోపాటు గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం సవాలుగా మారింది.
ఇది కూడా చదవండి: Temple Pradakshina Secrets | గుడిలో ప్రదక్షిణలు చేస్తున్నారా.. అయితే ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే!
