అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nayara Fuel Price Hike | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ.. నయారా ఎనర్జీ సంస్థ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రైవేట్ చమురు సంస్థ నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచింది.
దేశంలో చాలా వరకు పెట్రోల్ బంక్ (Petrol Pump)లను ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే కొన్ని బంక్‌లను ప్రైవేట్ సంస్థలు సైతం నిర్వహిస్తున్నాయి. దేశంలో అతి పెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్‌గా నయారా ఎనర్జీ కొనసాగుతోంది. ఈ సంస్థ తాజాగా పెట్రోల్ ధరలను (Petrol Prices) లీటరుకు రూ.5.30 చొప్పున, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచింది. దేశంలో మొత్తం 1,02,075 పెట్రోల్ బంక్‌లు ఉండగా.. 6,967 పంపులను నయారా ఎనర్జీ నిర్వహిస్తుంది. పెరిగిన ముడి చమురు ఖర్చులలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించుకున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Nayara Fuel Price Hike | పెట్రోల్ కోసం బారులు
ఇంధన కొరత ఆందోళనల మధ్య రాష్ట్రాల్లో ప్రజలు తమ వాహనాలకు ఇంధనం నింపుకోవడానికి పెట్రోల్ పంపుల వద్దకు పోటెత్తుతున్నారు. అదే సమయంలో, ఎల్‌పీజీ సంక్షోభం కూడా ఫిల్లింగ్ స్టేషన్లు (Filling Stations) మరియు డిపోల బయట పొడవైన క్యూలకు దారితీసింది. ఈ క్రమంలో నయారా ఎనర్జీ సంస్థ లీటరు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ ఆధారంగా రేట్ల పెంపులో స్వల్ప వ్యత్యాసాలు ఉండనున్నాయి. కాగా నయారా ఎనర్జీ సంస్థను రష్యా చమురు సంస్థ అయిన రాస్‌నెఫ్ట్ నిర్వహిస్తోంది.
Nayara Fuel Price Hike | వాటిల్లో పెంపు లేదు
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ మాత్రం ఇంధన ధరలను పెంచలేదు. అయితే ప్రీమియం పెట్రోల్ ధరలను మాత్రం లీటర్‌కు రూ.2.30 చొప్పున, ఇండస్ట్రియల్ డీజిల్‌ను లీటరుకు రూ.22 చొప్పున పెంచాయి. సామాన్యులు వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పెరిగిన ముడి చమురు ధరలను ఆయా కంపెనీలు భరిస్తున్నాయి. మరోవైపు దేశంలో 2,185 ఔట్లెట్లు ఉన్న రిలయన్స్-బీపీ కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పూ చేయలేదు.
ఇది కూడా చదవండి..: BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్.. బీఆర్ఎస్ సభ్యుల నిరసన

