అక్షరటుడే, వెబ్‌డెస్క్: Netflix Eyeline Studios | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గురువారం ప్రారంభించారు. నగరానికి నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే అన్నారు.
నెట్‌ఫ్లిక్స్ విస్తరణకు ఫ్యూచర్ సిటీలో అవసరమైన స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలను హైదరాబాద్ నుంచి కార్యకలాపాలను నిర్వహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోను ముఖ్యమంత్రి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఐలైన్ స్టూడియో ప్రారంభంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కానుందని సీఎం పేర్కొన్నారు.

Netflix Eyeline Studios | హాలీవుడ్ రావాలని..
తెలంగాణ (Telangana)కు టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ కూడా రావాలని తను ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ రోజు నెట్‌ఫ్లిక్స్ రావడంతో తన కల నిజం కాబోతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల కోసం ట్యాలెంట్, కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ అందిపుచ్చుకుంటే, హైదరాబాద్ అవకాశాలు, ప్రపంచ నైపుణ్యతను కలిగి ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐలైన్ స్టూడియో సీఈవో జెఫ్ షపిరో, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, సినీ నటుడు, నిర్మాత రాణా దగ్గుబాటి, తెలంగాణ ఫిలిం డెవల్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Land Encroachment | శ్మశానవాటికను వదలని అక్రమార్కులు.. కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువ

